
బోనకల్: ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చకుండా, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు పరిపాలన చేసే హక్కు, అర్హత లేదని వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రావినూతల, బోనకల్, ముష్టికుంట్ల గ్రామాల్లో సాగింది.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ... డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇళ్ల స్థలాలు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వంచించిన కేసీఆర్ తీరును ఇప్పటికే ప్రజలు గమనించారన్నారు. ఈ ప్రభుత్వంలో దళితులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని తెలిపారు. కేసీఆర్ పాలనలో బాగుపడింది ఆయన కుటుంబ సభ్యులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు మాత్రమేనన్నారు.
రుణమాఫీ చేయకుండా రైతుబంధు ఇస్తున్నామని చెప్పడం రైతులను మోసం చేయడమేనని తెలిపారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వాపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయమాటలతో మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు.