కేసీఆర్‌ దీక్ష ఎవరి కోసం?  | Telangana: MP Bandi Sanjay Comments On CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ దీక్ష ఎవరి కోసం? 

Nov 22 2021 2:11 AM | Updated on Nov 22 2021 7:13 AM

Telangana: MP Bandi Sanjay Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ చట్టాలను తన దీక్ష వల్లే రద్దు చేసిందని టీఆర్‌ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలాభిషేకాలు చేయించుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఎత్తేసిన ధర్నా చౌక్‌ వద్ద దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా లేక పంజాబ్‌ రైతుల కోసమా అన్నది ముఖ్యమంత్రి స్పష్టంచేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎత్తేసిన ధర్నా చౌక్‌ వద్దకే సీఎంను తీసుకొచ్చామని, ఇది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల ప్రభావంతో వేలాది మంది రైతుల ధాన్యం తడిసిపోతున్నా స్పందించలేదని మండిపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనేందుకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చినా అందులో 10 శాతం కూడా రాష్ట్రం కొనలేదు. మిల్లర్లతో కలిసి రైతులను నట్టేట ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆరుగురు రైతులు వడ్ల కుప్పపై గుండె ఆగి చనిపోయినా సీఎం మనసు కరగలేదు.

బీజేపీ నేతలు కల్లాలను సందర్శిస్తే రాళ్లు, కర్రలతో దాడి చేయించి రైతులు, బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టించారు’అని బండి అన్నారు. రాష్ట్రంలో చనిపోయిన రైతులను వదిలేసి ఢిల్లీలో చనిపోయిన రైతులకు రూ.3లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తారా అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, నిజంగా రైతులపట్ల ప్రేమ ఉంటే వాళ్లకు 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

విద్యుత్‌ చట్టాల పేరుతో...  
పంపుసెట్లకు కరెంట్‌ మీటర్లను బిగించాలంటూ చేసిన విద్యుత్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేసీఆర్‌ పదేపదే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. కేంద్రం మీటర్లు బిగించాలని చెప్పిందనడానికి రుజువు చూపాలని డిమాండ్‌ చేశారు. కృష్ణ, గోదావరి నదీ జలాల టిబ్యునల్‌ ఏర్పాటులో జాప్యానికి కేసీఆరే కారణమని, సుప్రీంకోర్టులో కేసు వేసి ఏడేళ్లపాటు నాన్చి కేంద్రానిదే బాధ్యత అనడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ కూడా స్పష్టంచేశారన్నారు. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆరే అని, కృష్ణా పరీవాహక ప్రాంతానికి అనుగుణంగా తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా 299 టీఎంసీలను కేటాయించే ఒప్పంద పత్రాలపై అపెక్స్‌ కమిటీ సమావేశంలో సంతకం చేసిన ఘనుడు కేసీఆర్‌ అని ఆరోపించారు. 

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడిఉన్నాం 
ఎస్సీ వర్గీకరణకు తాము ముందు నుంచి కట్టుబడి ఉన్నామని, మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్య తిరేకమని బండి స్పష్టంచేశారు. ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్‌ రద్దు చేసి గిరిజనులకు ఇవ్వాలన్నారు. బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్న కేసీఆర్‌ గతంలో నిర్వహించిన సమగ్ర సర్వే లెక్కలు బయటపెట్టాలని, ఏ కులాల వారు ఎంత మంది ఉన్నారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement