సాక్షి, సిటీబ్యూరో: అధిక ధరలకు కళ్లెం వేసి.. పన్నుల భారం తగ్గించి.. సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 లక్ష్యం నీరుగారుతోంది. జీఎస్టీ రెండు స్లాబుల్లో 28 –18 శాతానికి, 12 నుంచి 5 శాతానికి పన్నులను కేంద్రం తగ్గించింది.
పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయడం, పన్ను ఎగవేతకు చెక్ పెట్టడం, నిజాయతీ గల వ్యాపారులకు సౌలభ్యం కల్పించడమే దీని ఉద్దేశం. అయితే రాష్ట్రంలో జీఎస్టీ సంస్కరణలు కేవలం సర్క్యులర్లు, ప్రకటనలు, పోర్టల్ మార్పులకే పరిమితమయ్యాయని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వ్యాపార సంస్థలు తగ్గించిన పన్నులు కాకుండా యధాతథంగా పాత రేట్లతో బిల్లులు జారీ చేస్తున్నట్లు ‘సాక్షి’సర్వేలో తెలిసింది.
ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టి పన్ను తగ్గింపు పూర్తిస్థాయిలో అమలవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని వినియోగదారులు కోరుతున్నారు. వ్యాపారులు పాత రేట్లు వసూలు చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు మాత్రం కొత్త, తక్కువ రేట్లతో రిటర్న్స్ దాఖలు చేస్తున్నారని కొంతమంది అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇలా చేయడం జీఎస్‌టీ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి భంగం కల్పించినట్టేనని అంటున్నారు. జీఎస్‌టీ సంస్కరణలు అమలు కావాలంటే కఠిన తనిఖీలు, పాత రేట్ల వసూళ్లపై జీరో టాలరెన్స్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


