Harish Rao: తెలంగాణకు మొండిచేయి

Telangana Finance Minister Harish Rao fires on Union Budget 2023-24 - Sakshi

కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఫైర్‌ 

దేశాన్ని అప్పుల ఊబిలోకి  నెట్టివేసే బడ్జెట్‌ ఇది 

సాక్షి, హైదరాబాద్‌: అందమైన మాటల మాటున నిధుల కేటాయింపులో డొల్లతనాన్ని కప్పిపుచ్చుతూ అన్ని రంగాలను గాలికి వదిలేసి దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే విధంగా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణకు ఈ బడ్జెట్‌ మరోమారు అన్యాయం చేసిందని, రాష్ట్రానికి మొండిచేయి చూపెట్టిందని ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్‌ అని, ఇదో భ్రమల బడ్జెట్‌ అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై హరీశ్‌ స్పందన ఈ విధంగా ఉంది. 

రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ గురించి ఒక్కమాటలేదు.. 
‘తెలంగాణకు మరోమారు అన్యాయం చేశారు. తొమ్మిదేళ్లుగా అడుగుతున్న రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ గురించి ఒక్కమాట లేదు. గిరిజన యూనివర్సిటీకి ఇచి్చన నిధులు అంతంత మాత్రమే. ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. జీఎస్టీ రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు లేవు. తెలంగాణకు ఒక్క కొత్త పారిశ్రామికవాడ కూడా లేదు. గ్రామీణ ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టారు. ఎరువుల సబ్సిడీలు తగ్గించారు. ఆర్థిక సంఘాల సిఫారసులను అమలు చేస్తామని చెప్పలేదు. సింగరేణి కారి్మకులకిచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా లేవు.

ఉద్యోగులను భ్రమల్లో పెట్టారు. సెస్సులభారం తగ్గించలేదు. పన్నులభారం నుంచి ప్రజలకు ఉపశమనం లేదు. గత బడ్జెట్‌లో రూ.89,400 కోట్లు ఉపాధి హామీకి పెట్టిన కేంద్రం ఈసారి ఆ బడ్జెట్‌ను రూ.60 వేల కోట్లకు తగ్గించింది. గతేడాది బడ్జెట్‌లో 33 శాతం తగ్గించి ఉపాధి హామీ కూలీల ఉసురు తీసుకునే చర్యలకు ఉపక్రమించింది. ఆహారభద్రత నిధుల్లో భారీగా కోత పెట్టారు. గతేడాది 2.87 లక్షల కోట్లు కేటాయించి ఈసారి 1.97 లక్షల కోట్లకు తగ్గించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు 157 మెడికల్‌ కళాశాలలు మంజూరు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా లేదు. గతంలో మెడికల్‌ కాలేజీలు ఇచి్చన ప్రాంతాలకే ఇప్పుడు నర్సింగ్‌ కాలేజీలు ఇస్తున్నట్టు ప్రకటించి మరోమారు తీవ్ర అన్యాయం చేసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు ఇవ్వలేదు.  

రూ.5,300 కోట్లు కేటాయించి కర్ణాటక పట్ల పక్షపాతం 
కర్ణాటకలో ఎన్నికలున్నాయన్న కారణంతో ఆ రాష్ట్రానికి రూ.5,300 కోట్లు కేటాయించి కేంద్ర పాలకులు పక్షపాత వైఖరి చూపారు. ఎరువుల సబ్సిడీ నిధులను రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ.1.75 లక్షల కోట్లకు తగ్గించారు. గతేడాదితో పోలిస్తే 20 శాతం కోత పెట్టారు. పత్తి మద్దతుధరకు కేవలం రూ.లక్ష రూపాయలు కేటాయించి తీవ్ర నష్టం చేశారు. రాష్రీ్టయ కృషి వికాస్‌ యోజన కింద గత బడ్జెట్‌లో రూ.5,020 కోట్లు చూపెట్టి ఈసారి రూ.3,097 కోట్లకు కుదించారు. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తేనే 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అమలు చేస్తామని షరతు పెట్టారు. దీనివల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.6 వేల కోట్ల నష్టం జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం ఇవ్వాల్సిన నిధుల్లో కోత పెట్టి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు తీవ్ర అన్యాయం చేశారు. అప్పులను మూలధన వ్యయం కోసం కాకుండా, అప్పులో 48.7 శాతాన్ని రోజువారీ ఖర్చుల కోసం ప్రతిపాదించడం ఆర్థిక వ్యవస్థకే చేటుతెస్తుంది. రెవెన్యూ లోటు పెంపు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి విరుద్ధం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా కింద కేవలం 30.4 శాతం మత్రమే ఇస్తున్నారు. కానీ 41 శాతం ఇవ్వాలి. పన్నుల్లో వాటా పెంచామని కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాలవాటాను పెంచి, కేంద్ర కేటాయింపులను కుదించడంవల్ల రాష్ట్ర ప్రభుత్వం రెండు రకాలుగా నష్టపోతుంది.

అన్ని రంగాలనూ గాలికొదిలారు. 
రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచేలా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉంది. ఇది రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్‌. తెలంగాణకు మరోమారు అన్యాయం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు ఇవ్వలేదు.    

గతం కంటే 22 శాతం తగ్గుదల 
కేంద్రంలో రైతువ్యతిరేక ప్రభుత్వం నడుస్తోంది. ఈసారి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి గతేడాది కంటే 22 శాతం కేటాయింపులు తగ్గించారు. గత బడ్జెట్లో రూ.2.25 లక్షల కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.1.75 లక్షల కోట్లకు కుదించారు. మెల్లగా కేంద్రం ఎరువుల సబ్సిడీకి మంగళం పాడుతోంది. రైతులను ప్రత్యామ్నాయ ఎరువుల వైపు మళ్లించే పీఎం ప్రణామ్‌ పథకానికి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.     – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top