నదీ జలాల పంపిణీ ప్రధాన ఎజెండాగా నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
ప్రత్యేక చర్చ కింద కృష్ణా జలాల అంశంపై వాడీవేడి చర్చ
జీహెచ్‌ఎంసీ విస్తరణ, సరిహద్దుల నిర్ధారణ, జీఎస్టీ సవరణ తదితర మొత్తం ఏడు ఆర్డినెన్సులు
డిప్యూటీ స్పీకర్‌నూ ఎన్నుకునే అవకాశం... నేటి బీఏసీ భేటీలో షెడ్యూల్ ఖరారు
ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకానుండటంతో రాజకీయ వేడి
బీఆర్‌ఎస్ హయాంలోని నిర్ణయాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ అ్రస్తాలు
ప్రభుత్వ తీరును తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్
జలాల పంపిణీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి బీజేపీ రెడీ
నేడు ప్రారంభం కానున్న మండలి... తొలిరోజు సంతాపాలతో సరి
ఏర్పాట్లపై మండలి చైర్మన్ గుత్తా, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నదీ జలాల పంపిణీ అంశమే ప్రధాన ఎజెండాగా సోమవారం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఈ సమావేశాల్లో వాడీవేడి చర్చ జరగనుంది. ఇందుకోసం అధికార కాంగ్రెస్‌తోపాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ తీసుకున్న నిర్ణయాలను ఎండగట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ అస్త్రశ్రస్తాలు సిద్ధం చేసుకుంటుండగా, కాంగ్రెస్ వాదనలను సమర్థంగా తిప్పికొట్టడంతోపాటు తాము తీసుకున్న పకడ్బందీ చర్యలను ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. ఈ రెండు పార్టీలు నదీ జలాల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఎదురుదాడి చేస్తామని బీజేపీ చెబుతుండగా, ఈ చర్చలో తమ వంతు పాలుపంచుకునేందుకు ఎంఐఎం, సీపీఐ కూడా రెడీ అయ్యాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ కూడా హాజరుకానుండటంతో చలికాలంలో అసెంబ్లీ వేదికగా నీటి మంటలు పుట్టనున్నాయి.
తొలిరోజే ఆర్డినెన్సులు సభ ముందుకు
శీతాకాల సమావేశాల్లో భాగంగా శాసనసభ, శాసన మండలి సోమవారం ఉదయం 10:30 గంటలకు కొలువు తీరనున్నాయి. గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏడు ఆర్డినెన్సులను తొలిరోజే అసెంబ్లీ ముందుకు తేనున్నారు. ఈ జాబితాలో జీహెచ్‌ఎంసీ వివస్తరణ, సరిహద్దుల నిర్ధారణ, శివారులోని 27 మున్సిపాలిటీల విలీనం, జీఎస్టీ సవరణ, ముగ్గురు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తదితరాలున్నాయి. సోమవారం సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వస్తు సేవల పన్ను (సవరణ)–2025 ఆర్డినెన్సును సభ ముందుంచుతారు.
ఆ తర్వాత ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ)–2025, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (రెండో సవరణ)–2025, తెలంగాణ మున్సిపాలిటీస్ (రెండో సవరణ)–2025 ఆర్డినెన్సులను ప్రవేశపెడతారు. అనంతరం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సర్వ శిక్ష అభియాన్, పీఎం శ్రీ ఆడిట్ నివేదికలను ప్రవేశపెడతారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్విసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ (సవరణ)–2025, తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్విసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ (రెండో సవరణ)–2025 ఆర్డినెన్సులను సభ ముందుకు తేనున్నారు.
అనంతరం పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ)–2025 ఆర్డినెన్సు, ఎంపీపీ, జెడ్పీ ఎన్నికలకు సంబందించిన గెజిట్ నోటిఫికేషన్లను సభ ముందు పెట్టనున్నారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హారి్టకల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదిక ప్రవేశపెట్టనువ్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యేలు ఆర్.దామోదర్ రెడ్డి (సూర్యాపేట), కొండా లక్ష్మారెడ్డి (చేవెళ్ల) మృతి పట్ల సంతాపం తెలుపుతూ స్పీకర్ తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లోనే కవి అందెశ్రీ కుమారుడి ఉద్యోగం కోసం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్సు, రెండు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను కూడా తేనున్నట్టు సమాచారం.
మండలిలో ఇలా...
ఇక, మండలిలో తొలి రోజు రెండు సంతాప తీర్మానాలను పెట్టనున్నారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీలుగా పనిచేసి చనిపోయిన మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్‌షబ్బీర్ మృతికి సంతాపం ప్రకటించనున్నారు. అనంతరం మండలి వాయిదా పడుతుందని సమాచారం. అసెంబ్లీ, మండలి షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు అసెంబ్లీ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సోమవారం సమావేశంకానుంది. శీతాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ చేపట్టాలన్నది నిర్ణయిస్తారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం సభ వాయిదా పడిన తర్వాత మళ్లీ జనవరి 2న ప్రారంభం కానుంది. మూడు లేదా నాలుగు రోజులపాటు శీతాకాల సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా జరిగే అవకాశాలున్నట్లు తెలిసింది.
రాజకీయ ‘రణరంగమే’
కృష్ణా జలాల పంపిణీపై జరగనున్న శీతాకాల సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్పందనతోపాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని బట్టి చూస్తే ఈసారి అసెంబ్లీ వాడీవేడిగా జరగనుందని తెలుస్తోంది. ఈ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఆయన ఆదివారమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఈసారి కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ పట్టుపడుతోంది.
అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాలు తమ వాదనలను సమర్థవంతంగా వినిపించడం ద్వారా ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలు చేయనున్నాయి. అందులో భాగంగా ఈనెల 1న ప్రజాభవన్‌లో అధికార పక్షం పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తోంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అన్యాయాలను వివరించడంతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న పకడ్బందీ చర్యల గురించి వివరించనున్నారు. శీతాకాల సమావేశాల్లో బలమైన వాణి వినిపించేలా ఆయన కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని సిద్ధం చేయనున్నారు.
సజావుగా జరిగేలా చర్యలు: స్పీకర్
సమావేశాల నిర్వహణ, వసతుల కల్పన, భద్రతా ఏర్పాట్లపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం శాసనసభ కమిటీ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మండలి, అసెంబ్లీ కార్యదర్శులు నర్సింహాచార్యులు, రెండ్ల తిరుపతి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ విజయ్‌కమార్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు సజ్జనార్, అవినాశ్ మహంతి, సు«దీర్‌బాబు, కార్తికేయ (ఇంటెలిజెన్స్), కరుణాకర్ (అసెంబ్లీ చీఫ్‌మార్షల్) హాజరయ్యారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు.
సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని వీలైనంత త్వరగా ఇవ్వాలని, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు సభకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. సభ జరుగుతున్న సయంలో ధర్నాలు, ఆందోళనలకు తావు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పనిచేయాలని ఆదేశించారు. నోడల్, లైజనింగ్ అధికారులను నియమించాలని, సమావేశాలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ట్రాఫిక్ అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.


