పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరణ
వనశక్తి కేసులో సుప్రీంకోర్టు సడలింపులు ఈ ప్రాజెక్టుకు వర్తించవని తాజాగా స్పష్టికరణ
దీంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసేందుకు యత్నించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్
ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఉత్తమ్ పర్యటన వాయిదా
సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మార్గమంటున్న అధికార వర్గాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా తేల్చి చెప్పింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆ తర్వాత దశ (పోస్ట్ ఫ్యాక్టో)లో పర్యావరణ అనుమతులు ఇవ్వరాదని గతంలో ‘వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఇచ్చిన తీర్పుకు ఇటీవల సుప్రీంకోర్టు చేసిన సడలింపులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి వర్తించవని స్పష్టం చేసింది. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ నిపుణులతో కలిసి రెండు మూడు రోజుల కింద కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శిని కలిసి సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన సడలింపుల ఆధారంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని కోరగా.. కేంద్రం నుంచి ప్రతికూల స్పందన వచ్చినట్టు తెలిసింది.
పాలమూరు–రంగారెడ్డి విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఇటీవల తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంలో సాధించిన పురోగతిపై సోమవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లో కీలక ప్రకటన చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి వద్దకు ఢిల్లీలోని రాష్ట్ర అధికారుల బృందాన్ని ప్రభుత్వం పంపించగా, సానుకూల స్పందన రాలేదు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లి స్వయంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసేందుకు సన్నద్దమయ్యారు. అయితే, కేంద్ర మంత్రి ఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో ఉత్తమ్ పర్యటన చివరి క్షణంలో రద్దయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుకు అనుమతులు పొందడం సాధ్యం కాదని, సుప్రీంకోర్టును ఆశ్రయించి అనుకూల తీర్పు తీసుకురావాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
అనుమతులు వచ్చి ఆగిన వైనం
కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల మదింపు కమిటీ 2023 జూలై 24న సమావేశమై పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ఈఏసీ సిఫారసు చేస్తే అనుమతి రావడం లాంఛనమే. అయితే పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టినందుకు ప్రాజెక్టును ప్రతిపాదించిన అధికారి (ప్రాజెక్టు ప్రపోనెంట్)పై పర్యావరణ పరిరక్షణ చట్టం–1986లోని సెక్షన్ 19 కింద రాష్ట్ర ప్రభుత్వం/కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ అప్పట్లో షరతు విధించింది. పర్యావరణ అనుమతుల జారీకి ముందు ఆ వివరాలను సమరి్పంచాలని సూచించింది. అనుమతులు జారీ చేసే వరకు ప్రాజెక్టు నిర్వహణ చేపట్టరాదని స్పష్టం చేసింది.
దీంతో కొందరు అధికారులపై స్థానిక కోర్టులో కేసు పెట్టి ఆ వివరాలను కేంద్ర పర్యావరణ శాఖకు పంపింది. దీనిపై సంతృప్తి చెందని పర్యావరణ శాఖ.. అనుమతులు జారీ చేయకుండా అదనపు సమాచారం కోరింది. ఆలోగా సుప్రీం కోర్టు ‘వనశక్తి’ కేసులో తీర్పును ప్రకటిస్తూ ఇలాంటి ప్రాజెక్టులకి పర్యావరణ అనుమతుల జారీపై నిషేధం విధించింది. పర్యావరణ అనుమతులు పొందకుండా చేపట్టిన ప్రాజెక్టులకు ఆ తర్వాతి దశలో జరిమానాలతో అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం 2017లో జారీ చేసిన నోటిఫికేషన్, 2021లో జారీ చేసిన మెమోరాండంను కొట్టేస్తూ జస్టిస్ అభయ్ ఎస్. ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం గత మే 15న ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇకపై ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేయకుండా కేంద్రంపై ఆంక్షలు విధించింది. దీంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియకు కేంద్రం ఫుల్‌స్టాప్ పెట్టింది.
కోర్టు అనుకూల తీర్పు ఇచ్చినా...
పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా చేపట్టిన ప్రాజెక్టులకు ఆ తర్వాతి దశలో అనుమతులు ఇవ్వరాదని గత మే 15న ‘వనశక్తి’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గత నవంబర్ 18న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసం తిరగరాసింది. భారీగా ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులను కూలి్చవేస్తే దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. భారీ జరిమానాలు వంటి కఠిన నిబంధనలతో అనుమతులు జారీ చేయొచ్చని సూచించింది.
ఈ సడలింపుల మేరకు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు శరాఘాతం ఎదురైందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. తొలుత రూ.21,200 కోట్ల అంచనాతో ప్రాజెక్టును చేపట్టగా, ఆ తర్వాత అంచనాలు రూ.56 వేల కోట్లకు పెరిగాయి. ఇప్పటికే రూ.32 వేల కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. ఈ దశలో ప్రాజెక్టుకి అనుమతులను కేంద్రం నిరాకరిస్తే చేసిన ఖర్చు నిరర్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.


