2023లో అధికారమే లక్ష్యం 

Telangana Congress Party Focused On 2023 Elections - Sakshi

టీపీసీసీ నేతలకు కొత్త ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ దిశానిర్దేశం

కలిసికట్టుగా శ్రమించాలి 

త్వరలో రాబోయే ఎన్నికలన్నింటిలోనూ గెలవాలి 

ప్రతి నాయకుడు తానే అభ్యర్థిననే భావనతో పనిచేయాలి 

కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళిక రూపొందించండి 

సాక్షి, హైదరాబాద్‌: 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్‌ నాయకుడు పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ పిలుపునిచ్చారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. రాష్ట్రంలో త్వరలో రానున్న దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలన్నింటిలో పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని మాణిక్యం ఠాగూర్‌ టీపీసీసీ నేతలను కోరారు. తన తొలి పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులతో వరుసగా భేటీ అయ్యారు. ఉదయం దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎన్నికలు, తర్వాత జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించిన సమీక్షలు జరిపారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై ఎన్నికల వ్యూహాలు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశాల్లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలతో పాటు పలు జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాణిక్యం మాట్లాడుతూ  అన్ని ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థిని అనుకొని పని చేయాలని, టీమ్‌వర్క్‌తో అందరూ పనిచేస్తేనే ఫలితం దక్కుతుందన్నారు. బౌలర్, బ్యాట్స్‌మెన్‌లే కాకుండా ప్రతి ఆటగాడు బాగా ఆడితేనే క్రికెట్‌ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని, ఇదే స్ఫూర్తిని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అలవర్చుకోవాలని కోరారు. అన్ని ముఖ్యమైన అంశాలపై సబ్‌ కమిటీలు వేసి లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల్లో ఉండి పోరాడాలన్నారు.  

ఎన్నికల కోసం వ్యూహరచన 
దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితం వస్తుందని మాణిక్యం ధీమా వ్యక్తం చేశారు. ప్రతి రెండు గ్రామాలకు ఒకరికి బాధ్యతలు అప్పగించాలని, అదే విధంగా ఏడు మండలాలకు ఏడుగురు ఇన్‌చార్జులను నియమించా లని, బూత్‌ల వారీగా ఓటర్లను చైతన్యపర్చే కార్యక్రమంలో ముందుండాలని కోరారు. ఇక గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో కొత్త ఓటర్లను పార్టీవైపు తిప్పుకునే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు చేసిందేమీ లేదని, ఎన్నికల వాగ్దానమైన నిరుద్యోగ భృతిని అమలు పర్చలేదని విమర్శించారు. వీటన్నింటినీ పట్టభద్రుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అదే విధంగా పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టి పనిచేయాలని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలతోపాటు విశ్వనగరం హైదరాబాద్‌ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం నగరాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్య తలను ముఖ్య నేతలు తీసుకోవాలన్నారు.

కోదండకు మద్దతు వద్దు  
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వొద్దని, పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు తేల్చిచెప్పారు. రెండు స్థానాలూ కాంగ్రెస్‌ గెలిచే అవకాశముందని నేతలు అభిప్రాయçపడినట్లు తెలి సింది. మద్దతు కోరుతూ టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ పార్టీకి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పినట్టు సమాచారం. 

ప్రతి నెలా డీసీసీ అధ్యక్షులతో సమావేశం
డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాణిక్యం మాట్లాడుతూ జిల్లా పార్టీ అధ్యక్షులు నిరంతరం ప్రజల్లో ఉండాలని, ఎల్లవేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి డీసీసీ అధ్యక్షుడు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపే టార్గెట్‌గా పనిచేస్తే అధికారంలోకి వస్తామన్నారు. ప్రతినెలా తాను డీసీసీ అధ్యక్షులతో సమావేశమవుతానని, జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతినెలా మం డల స్థాయిలో ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలన్నారు. డీసీసీ అధ్యక్షులతో మాట్లాడకుండా పార్టీపరంగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top