బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలసి పోటీ చేయవు: బండి సంజయ్‌

Telangana BJP Chief Bandi Sanjay Serious Comments On CM KCR - Sakshi

కేసీఆర్‌ విధానాలతో నీటి వాటా కోల్పోతున్నాం  

ముస్లింల అభ్యున్నతిపై ఎంఐఎంకు చిత్తశుద్ధి లేదు 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజం

వికారాబాద్‌ జిల్లాలో కొనసాగిన సంకల్ప యాత్ర 

వికారాబాద్‌: తెలంగాణకు మొదటి ద్రోహి కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలో కొనసాగింది. ఇందులో భాగంగా మన్నెగూడ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌ షోలో ఆయన ప్రసంగించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలసి పోటీ చేయబోవని తేల్చిచెప్పారు. ప్రజలను, ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసేందుకు కేసీఆర్‌కు సమయం ఉండదన్నారు.

ప్రధాని మోదీ మాత్రం దేశ ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తారని తెలిపారు. అందులో భాగంగా కేసీఆర్‌ ఎప్పుడు వెళ్లినా అపాయింట్‌మెంట్‌ ఇస్తారని చెప్పారు. ఇది ఆసరాగా చేసుకుని ప్రధాని తనను ప్రశంసించారని తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుంటారని ఎద్దేవా చేశారు.  

నీటి వాటా కోల్పోతున్నాం..  
సీఎం కేసీఆర్‌ కమీషన్ల కోసం పక్క రాష్ట్ర సీఎంతో కుమ్మక్కయ్యా రని బండి ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే దళితబంధు పథకాన్ని తెరపైకి తెచ్చారని, అమలులో మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలవదని జోస్యం చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ఒట్టి బూటకం అని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లిచ్చే ఆలోచనేదీ ఆయనకు లేదన్నారు. నీటి కేటాయింపులో ద్రోహం చేసిన కేసీఆర్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు.

రైతు వేదికలు, ఉచిత బియ్యం లాంటి పథకాలన్నీ బీజేపీ చలవేనని తెలిపారు. అన్యమతాల ముసుగులో ఎవరైనా హిందువుల జోలికొస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఎంఐఎంతో యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ముస్లింల అభ్యున్నతిపై, పాతబస్తీ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పాత బస్తీకి మెట్రో రైలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. యాత్రలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్,  బీజేపీ నేతలు సదానంద్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌ పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top