జనసేన వద్దు బాబోయ్‌: బీజేపీ కార్యకర్తలు | Telangana BJP Cadre Protest Oppose JanaSena Party Alliance | Sakshi
Sakshi News home page

జనసేన వద్దు బాబోయ్‌: తెలంగాణ బీజేపీ ఆఫీస్‌ వద్ద వరుస ఆందోళనలు

Oct 30 2023 12:01 PM | Updated on Oct 30 2023 1:19 PM

Telangana BJP Cadre Protest Oppose JanaSena Party Alliance - Sakshi

పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు.. 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి పొత్తుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. అయితే గతంలో 32 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌కు.. హస్తిన పర్యటనలో ఊహించని ఝలక్‌ తగిలింది. సీట్ల విషయంలో రాజీపడాల్సిందేనని అమిత్‌ షా, పవన్‌తో చెప్పినట్లు సమాచారం. అయితే తెలంగాణలో అదే మహాప్రసాదంగా భావించిన పవన్‌.. అప్రాధాన్యత సీట్లు కాకుండా తాము ఎంపిక చేసిన స్థానాలే కావాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో పొత్తు చర్చ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్లు అర్థమవుతోంది. 

ఈలోపు జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపు బీజేపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు వద్దు బాబోయ్‌ అని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని రాష్ట్ర నేతలపై, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఇప్పుడు ఏ ప్రాతిపాదికన సీట్లు కేటాయిస్తారంటూ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గత మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జనసేనకు కేటాయించేందుకు బీజేపీ సిద్ధమైంది. దీంతో ఆయా నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. సోమవారం కూకట్‌పల్లి కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఎట్టిపరిస్థితుల్లో కూకట్‌పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్‌తో.. నినాదాలు చేశారు.  జనం లేని జనసేనతో పొత్తు అవసరమా? అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. మరోవైపు ఆదివారం కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. శేరిలింగంపల్లి సీటు ఇవ్వొద్దంటూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 

శేరిలింగంపల్లి టిక్కెట్‌ను జనసేనకు కేటాయించడంపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్‌ను రవికుమార్ యాదవ్‌కు ఇవ్వాల్సిందేనని కొండా విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లి సీటు రవికుమార్ యాదవ్ కోసం కొండా పట్టుపడుతున్నారు.

మరోవైపు కూకట్‌పల్లి సీటును జనసేనకు ఇచ్చే ప్రతిపాదనను మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. మెదట నుంచి పనిచేస్తున్న వారికి అన్యాయం చేయొద్దని ఆయన వాపోతున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement