
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. అసమ్మతి నేతలు టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించివేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, సదరు ఎమ్మెల్యే.. అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలే ఇందుకు కారణమని అసమ్మతి వర్గం నేతలు చర్చించుకుంటున్నారు.
ఉదయగిరి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి పీక్ స్టేజ్ చేరుకుంది. ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లెక్సీలను అసమ్మతి నేతలు చించివేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం టీడీపీ నేతలు చించేయడంతో రాజకీయం వేడెక్కింది. అంతకుముందు.. జలదంకి, వరికుంటపాడుతో పాటు తాజాగా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.
అయితే, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంగా ఉన్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలోనే ఇలా అసమ్మతి నేతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సురేష్‌కు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.