
- టీడీపీ ఎమ్మెల్యేల్లో గుబులు
- ఏడాదిలో ఒక్క ఎన్నికల హామీ సరిగా నెరవేర్చని కూటమి సర్కారు
- విచ్చలవిడిగా మద్యం విక్రయాలపై మహిళల ఆగ్రహం
- పైసా సాయం చేయకపోవడంతో రైతన్నల్లో అసంతప్తి
- ఈ క్రమంలో ‘సుపరిపాలన’ అంటూ ప్రతి ఇంటికీ వెళ్లమంటున్న బాబు
- క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు
అలివిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు..తర్వాత వాటిని గాలికొదలడంతో ఐదేళ్ల వ్యతిరేకతను ఏడాదిలోనే మూటగట్టుకున్నారు. మహిళలు, రైతులు, ఉద్యోగులు ఇలా ఏ వర్గాన్ని కదిలించినా కూటమి పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలన అంటూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పడంతో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల్లో గెలిచి ఏడాది దాటినా ఏ ఎమ్మెల్యే కూడా ఒక్క పల్లెకూ వెళ్లిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఏడాదిలో చేసిన ‘సుపరిపాలన’ను ఇంటింటికీ వెళ్లి వివరించాలని సీఎం చంద్రబాబు చెబుతుండడంతో ప్రజల వద్దకు వెళ్లి ఏం చేశామని చెప్పాలంటూ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. ఓవైపు రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాం.. మరోవైపు పెన్షన్ మినహా అన్ని పథకాలకూ మంగళం పాడాం.. ‘అమ్మ ఒడి’ సగం కోతలు, సగం వాతలు తరహాలో ఇచ్చాం.. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ వెళితే మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లడం అంత మంచిది కాదని చాలా మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.
కబ్జాలు, ఆక్రమణలతో వణుకు
జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో ఎమ్మెల్యేల అనుచరులు భూ ఆక్రమణలు, కబ్జాలు ఇబ్బడిముబ్బడిగా చేశారు. దీంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి దగ్గరకు వెళ్తే నిలదీసి కడిగిపారేస్తారన్న భయం ఎమ్మెల్యేల్లో ఉంది. అంతేకాదు తమ కార్యకర్తలు ఏం చేసినా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి విడిపించుకుంటున్నారు. బాధితులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ‘తమ్ముళ్లు’ దాడులు చేసినా బాధితులకు న్యాయం లేదు. దీంతో ఎమ్మెల్యేలు తమ వార్డుల్లోకి వస్తే నిలదీసేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మహిళలు ‘బెల్టు’ తీస్తారు..!
ఉమ్మడి జిల్లాలో 230 వైన్ షాపులుండగా.. 2,100 బెల్టుషాపులు ఉన్నాయి. ఈ క్రమంలో విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతుండడంతో పేద కుటుంబాలు గుల్లవుతున్నాయి. దీంతో మహిళల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో కొన్ని చోట్ల నిరసనలకు దిగారు. ఇలాంటి సమయంలో పల్లెలకు ఎమ్మెల్యేలు వెళితే ‘బెల్టు’ తీస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది.
ఉద్యోగులు నిజం తెలుసుకున్నారు..
ఉద్యోగులందరూ ఎన్నికల్లో టీడీపీకి గంపగుత్తగా ఓట్లేశారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నాయి. బదిలీల్లో నాయకుల పాత్రపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సిఫార్సు లేఖలు, లంచాలతో తమకు కావాల్సిన వారిని దగ్గరకు చేర్చుకోవడంతో వేలాది మంది సామాన్య ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి విభాగం బదిలీలోనూ అవినీతి అక్రమాలే. ఈ సమయంలో ఎమ్మెల్యేలకు అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఆగ్రహంలో రైతన్నలు
ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ రెండో ఏడాది వచ్చినా పైసా ఇవ్వలేదు. ఖరీఫ్ ప్రారంభమైనా రూపాయి అందించలేదు. పైగా పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. దీంతో అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. ‘ఎమ్మెల్యేలైతే మాకేంటి..ఊర్లోకి వస్తే చూస్తాం’ అంటూ మండిపడుతున్నారు.