
కూచ్ బెహార్: పశ్చిమబెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారి కాన్వాయ్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇవాళ కూచ్ బెహార్‌లో నిర్వహించిన ర్యాలీలో సువేందు అధికారి పాల్గొన్నారు. ఇటీవల బెంగాల్‌లో మహిళలపై హింస, నేరాలు పెరుగుతున్న క్రమంలో టీఎంసీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆయన ర్యాలీ నిర్వహించగా.. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు విసిరారు. దాడులకు సంబంధించిన వివరాలను సమర్పించేందుకు ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఖగ్రాబారి ప్రాంతంలో సువేందు అధికారి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో నల్ల జెండాలు పట్టుకున్న నిరసన కారులు ‘వెళ్లిపో’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వాహనంపై చెప్పులు విసిరారు. పోలీసు ఎస్కార్ట్ వాహనం కూడా ధ్వంసమైంది. ఆ సమయంలోనే అధికార ప్రభుత్వానికి చెందిన నేతలు, కార్యకర్తలు ఇక్కడ నిరసనలు తెలుపుతున్నారు. టీఎంసీ కార్యకర్తలే దాడి చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం ఆడుతున్న డ్రామాగా అంటూ టీఎంసీ నేతలు అభివర్ణిఇంచారు. ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష గళాన్ని అణచివేయాలనే కుట్ర అంటూ బీజేపీ మండిపడింది. బుల్లెట్‌ప్రూఫ్ కారులో ఉండడం వల్లే సువేందు ప్రాణాలతో బయటపడినట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.