
సాక్షి, కర్నూలు: తమపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో తమకు పరిహారం అందించారన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 14 నెలలు అవుతున్న తమకు న్యాయం చేయలేదని పార్వతి అన్నారు.
‘‘తమకు న్యాయం చేయక పోగా పవన్.. తమపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పవన్ రెండు ఉద్యోగాలు ఇప్పించారని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగనే మాకు ఉద్యోగం ఇప్పించారు. డీఎన్‌ఏ రిపోర్టులు మార్చారని.. పవన్ ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. న్యాయం చేయమని అడిగితే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. నిందితులను శిక్షించేవరకు పోరాడతా’’ అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పష్టం చేశారు.