అప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడు వద్దంటున్నారు! | Sakshi
Sakshi News home page

అప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడు వద్దంటున్నారు!

Published Sun, Jan 28 2024 3:20 PM

Special Story On Inturi Nageswara Rao - Sakshi

వాడుకోవడం.. వదిలేయడం అనే కామెంట్ వినిపిస్తే వెంటనే గుర్తుకొచ్చే పేరు నారా చంద్రబాబు. పచ్చ పార్టీ అధినేతగా వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పేరుపొందారు చంద్రబాబునాయుడు. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. అక్కడ నాలుగేళ్ళుగా పార్టీని నడిపించిన నేతకు చెక్‌ పెడుతున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మా ఇన్‌చార్జ్‌ దేవుడు అన్న కొందరు నేతలు ఇప్పుడు ఆయన వద్దని డిమాండ్ చేస్తున్నారట. అసలు ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కడుంది? 

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గానికి ఓ రాజకీయ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కమ్మ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండటంతో సహజంగానే తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ పోటీ ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి టీడీపీ తరపున 2014లో గెలిచిన పోతుల రామారావు 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ హవాలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోగానే పోతుల రామారావు ఒక్కసారిగా రాజకీయాలకు దూరం జరిగారు. టీడీపీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడంలేదు. దీంతో ఆయన స్థానంలో ఇంటూరి నాగేశ్వరరావును కందుకూరు ఇన్‌చార్జ్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. అప్పటి నుండి నియోజకవర్గంలో టీడీపీకి కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. కందుకూరులో కచ్చితంగా ఏడాది క్రితం చంద్రబాబు నిర్వహించిన సభలో తొమ్మిది మంది చనిపోవడంతో చంద్రబాబు సభలంటే ప్రజలలో ఒకరకమైన భయం ఏర్పడింది.

కందుకూరులో సభ ఏర్పాట్లపై ఇంటూరి నిర్లక్ష్యం, తప్పిదాల వల్లే తొక్కిసలాట జరిగిందంటూ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఇంటూరికి బాబాయి కొడుకు ఇంటూరి రాజేష్ రూపంలో అసమ్మతి వర్గం ఏర్పడింది. సొంత కుటుంబంలోనే ఏర్పడిన అసమ్మతిని తగ్గించుకోవడంలో ఇంటూరి నాగేశ్వరరావు విఫలం అయ్యారని కార్యకర్తలే అంటున్నారు. వివాదరహితుడిగా పేరున్న ఇంటూరి నాగేశ్వరరావుని ఆ పార్టీలోని రెండో వర్గమే వివాదాస్పదుడిగా చిత్రీకరించిందని ఆయన వర్గం మండిపడుతోంది. నాలుగు సంవత్సరాలపాటు తనతో డబ్బు ఖర్చుపెట్టించి ఎన్నికలు వచ్చేసరికి తనకు టిక్కెట్ దక్కకుండా చేయాలనే దుష్ప్రచారం ప్రారంభించారని ఇంటూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఇంటూరి నాగేశ్వరరావుకు పార్టీలోను, సొంత కుటుంబంలోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. బాబాయి కొడుకు ఇంటూరి రాజేష్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుతో కలిసి తన వ్యతిరేక  వర్గంగా ఏర్పడటాన్ని నాగేశ్వరరావు వర్గీయులు జీర్నించుకోలేకపోతున్నారు. కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన బిజేపి మహిళా మోర్చా అద్యక్షురాలు ఉన్నం నళినీదేవి పార్టీలో‌ సీనియర్ నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ కలిసి మరో వర్గంగా ఏర్పడటం కూడా నాగేశ్వరరావుకు మింగుడు పడటంలేదు. వాడుకొని వదిలేసే అలవాటు ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు..ఇప్పుడు  ఇంటూరి నాగేశ్వరరావుని వదిలించుకోవడానికే బీజేపీ నుంచి నళినీదేవిని పార్టీలోకి తీసుకున్నారని తెలుగుతమ్మళ్లే చెబుతున్నారు. అందుకే కొంతమంది కార్యకర్తలను ఉసిగొల్పి నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారనే టాక్ నడుస్తోంది.  

చంద్రబాబు యూజ్ అండ్ త్రో విధానానికి కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు బలవుతున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇంటూరితో నాలుగు సంవత్సరాల పాటు పార్టీ కోసం ఖర్చు పెట్టించి ఇప్పుడు పక్కన పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి టిక్కెట్ రాకపోతే ఇంటూరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Advertisement
 
Advertisement