ఒకప్పుడు ఆ జిల్లాలో ఏకచక్రాధిపత్యం.. నేడు జీరో! | Special Story On BRS Party Mahabubnagar District | Sakshi
Sakshi News home page

ఒకప్పుడు ఆ జిల్లాలో ఏకచక్రాధిపత్యం.. నేడు జీరో!

Published Fri, Jun 14 2024 4:22 PM | Last Updated on Fri, Jun 14 2024 4:26 PM

Special Story On BRS Party Mahabubnagar District

ఒకనాడు ఆ జిల్లాలో గులాబీ పార్టీ జైత్రయాత్ర కొనసాగించింది. ఒకటీ అరా మినహా సర్పంచ్ నుంచి ఎంపీ సీట్ల వరకు బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఎన్నికలు ఏవైనా విజయం తమదే అనే ధీమాతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకునేవి. 

కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అక్కడ హస్తం హవా మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు హస్తంకు, మరో సీటు కమలానికి దక్కాయి. గులాబీ పార్టీ మొత్తంగా జీరో అయిపోయింది. ఇన్ని పరాజయాల మధ్య ఓ విజయం బీఆర్ఎస్‌ను పలకరించింది. ఆ విజయం ఏంటి? ఇంతకీ ఆ జిల్లా ఏది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కారు పార్టీ జైత్రయాత్రకు అడ్డే లేకుండా పోయింది. పదేళ్ళ పాటు జిల్లాలో ఏకచక్రాధిపత్యం చెలాయించారు గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అట్టడుగు నుంచి ఉన్నత స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా విజయం గులాబీ పార్టీదే అన్న రేంజ్‌ కొనసాగింది. కాని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కారు స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి.

అగ్రతాంబూలం అందుకున్న జిల్లాలో  అథః పాతాళానికి పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలనే గెలిపించుకోగలిగింది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురు కావడంతో గులాబీ శ్రేణలు డీలా పడ్డాయి. కాని ఇదే సమయంలో స్దానిక సంస్దల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ది నవీన్‌కుమార్ రెడ్డి విజయం సాధించటంతో కొంత ఊరట చెందారు. పార్టీ ఇంతగా పరాజయం పొందటానికి నేతల మద్య సమన్వయ లోపం..తమకేంటిలే అనే నిర్లక్ష్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కొద్దికాలానికే వచ్చి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన బస్సుయాత్రలు సక్సెస్ కావటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరట చెందారు. ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్ది నవీన్‌రెడ్డి గెలువటం కూడా వారిలో కొత్త ఆశలు చిగురించాయి. కాని లోక్‌సభ ఎన్నికల్లో రెండుస్దానాల్లో పార్టీ అభ్యర్దులు ఘోరంగా ఓడిపోవటం..అదీ మూడవ స్దానానికే పరిమితం కావటం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రేస్, బీజేపీ మధ్యనే సాగింది. నాగర్‌కర్నూల్ స్దానంలో కొంత ప్రభావం చూపగలిగినా..మహబూబ్‌నగర్ స్దానంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్ది అసలు ప్రభావం చూపలేకపోయారు. ఈ స్దానంలో 2009 నుంచి 2019 వరకు వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది.  

లోక్‌సభ ఎన్నికల్లో పెద్దఎత్తున బీఆర్ఎస్ ఓట్లు  బీజేపీకి బదిలీకావటం కూడ నష్టం కలిగించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ కావాలనే తమ పార్టీ ఓట్లను కమలం గుర్తుకు బదిలీ చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్‌లో ఇక ఇక్కడ బీఆర్ఎస్‌కు స్దానం ఉండదని కాంగ్రెస్ అంటోంది. కాని బీఆర్ఎస్ నేతలు మాత్రం మళ్లీ పాలమూరు జిల్లాలో పూర్వవైభవం సాధిస్తామని చెబుతున్నారు.

ఇప్పటికే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయటంలో కాంగ్రేస్ ప్రభుత్వం విఫలయ్యిందని మండిపడుతున్నారు. రానున్న స్దానిక సంస్ధల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావటం అత్యధికంగా ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కాంగ్రెస్‌ పార్టీకి ఉండటం..మరోవైపు మహబూబ్‌నగర్ ఎంపీ స్దానంలో బీజేపీ గెలవటంతో ఆ రెండు పార్టీలు బలంగా తయారయ్యాయి. కేంద్రలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం, కమలం పార్టీల మధ్య కారు పార్టీ మనుగడ ఎలా సాగుతుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement