బాబు బ్యాచ్ చిత్తు..! | Sakshi
Sakshi News home page

బాబు బ్యాచ్ చిత్తు..!

Published Mon, Jan 15 2024 10:00 AM

Special Story On Analysis Of AP Politics - Sakshi

ఏపీలో సంక్రాంతి సందడి నెలకొంది. పందెం కోళ్లు కత్తులు కట్టుకుని నువ్వా నేనా అంటున్నాయి.  భోగి మంటలు చలిని తరిమేస్తున్నాయి. మంచు తెరలు ముచ్చట గొలుపుతున్నాయి. కానీ.. రాజకీయ వేడి దెబ్బకు మంచు తెరలు కరిగిపోతున్నాయోమో అనిపిస్తోంది. ప్రతి పక్షాల కంటే వైఎస్సార్‌సీపీ దూకుడుగా కనిపిస్తోంది. టార్గెట్ 175 దిశగా సీఎం జగన్ రామబాణంలా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే 50 శాసన సభ నియోజకవర్గాలు,  9 లోక్ సభ స్థానాల్లో సమన్వయకర్తలను నియమించారు.  రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. టికెట్ రాని వారిని బుజ్జగిస్తూ.. ఆశావాహులకు సర్ధి చెబుతూ విజయావకాశాలు ఉన్న వారికి టికెట్లు ఇస్తున్నారు. 

సామాజిక సమీకరణలు మనసులో పెట్టుకుని సీఎం జగన్ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటున్నారు.ఒకటికీ పది సార్లు ఆలోచించి ముందుకెళ్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, సామాజిక సాధికార యాత్రలు విజయవంతం అవడంతో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జనవరి 25 నుంచి సీఎం జగన్ ప్రాంతాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు.  ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. 

ఎన్నికల యుద్ధానికి సీఎం జగన్ సకలం సిద్దం చేసుకుంటూ ఉంటే.. ప్రతిపక్షాలు మాత్రం పొత్తులతో కుస్తీ పడుతున్నాయి. నాలుగు దశబ్దాల చరిత్ర ఉన్న తెలుగు దేశం పార్టీ 175 స్థానాల్లో సరైన అభ్యర్ధులు లేక విలవిలలాడిపోతుంది. ఇప్పటికే.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ సీపీలో చేరారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకే రాంరాం చెప్పేశారు. ఇప్పటి వరకూ  టీడీపీకి ఆర్ధికంగా అండదండగా ఉన్న రాయపాటి సాంబశివ రావు కుమారుడు రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు.  ఈయన చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌. ఈ పచ్చ సునామీ అంతా కూడా అమరావతి సరిహద్దుగా ఉన్నా.. గుంటూరు , ఎన్టీఆర్ జిల్లాలో సంభవించింది. గత వారం రోజులుగా ఈ రెండు జిల్లాల్లో జరుగుతోన్న రాజకీయ పరిణామాలతో టీడీపీ కుదేలు కాబోతుందనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి.

1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీ, సీఎం పదవిని లాక్కున్న దగ్గరి నుంచి చంద్రబాబు రెండింటినే నమ్ముకున్నారు. 
1. ఎల్లో మీడియా 
2. పొత్తులు

ఈ రెండు లేకుండా చంద్రబాబు రాజకీయ జీవితం లేదు. 1999లో బీజేపీతో పొత్తు, 2014లో బీజేపీ - జనసేనలతో పొత్తు. పొత్తులు ఉంటేనే చంద్రబాబు... పొత్తులు లేకపోతే చంద్రబాబు లేడు అనడానికి ఇదే సాక్ష్యం. తన రాజకీయ జీవితంలో చంద్రబాబు ఏనాడు ప్రజలను నమ్ముకోలేదు.. నమ్ముకోడు కూడా. ఎందుకంటే.. చంద్రబాబు దృష్టిలో ప్రజలంటే మనుషులు కాదు ఓటర్లు మాత్రమేనన్న ప్రచారం జనబాహుళ్యంలో ఉంది.

చంద్రబాబు ఇచ్చే హామీలు అధికారంలోకి రావడానికేనని తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటుంటారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీలకు సమాధి ఎలా కట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసు. 2014లో మేనిఫెస్టోలో 650 హామీలిచ్చారు. 650 హామీల్లో ఏనాడు ఒక్క హామీ నెరవేర్చలేదు. పైగా మేనిఫెస్టో టీడీపీ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించారు.  ఇదీ.. చంద్రబాబుకు మేనిఫెస్టో మీద ఉన్న విశ్వసనీయత అన్నది చరిత్ర చెబుతున్న సత్యం.

2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు తన సహజ సిద్ధ రాజకీయాలతో ముందుకు వస్తున్నారు. ఎల్లో మీడియాను ముందు పెట్టి యుద్ధం చేస్తున్నారని, కాపుల ఓట్ల కోసం జనసేన పొత్తు అనే నాటకాన్ని మొదలు పెట్టారని అర్థమవుతోంది. టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తమ పేజీల్లో ఇరికించబోతున్నారని,  ప్రజలను మరోసారి ప్రజాస్వామ్యం సాక్షిగా మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని ఆయన్ను అనుసరిస్తోన్న రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొత్తు కోసం చర్చలు, మేనిఫెస్టోపై చర్చలు ఎల్లో కల్పనలే.. ప్రజలను నమ్మించడానికేనంటున్నారు విశ్లేషకులు.

 
Advertisement
 
Advertisement