మహిళా అభ్యర్థి ఒక్కరేనా? కాంగ్రెస్‌ నాయకురాలి అసంతృప్తి | Reason Behind Why Shama Mohamed Disappointed With Congress Kerala Candidates List Ahead Of Lok Sabha Polls - Sakshi
Sakshi News home page

మహిళా అభ్యర్థి ఒక్కరేనా? కాంగ్రెస్‌ నాయకురాలి అసంతృప్తి

Mar 11 2024 7:37 AM | Updated on Mar 11 2024 9:42 AM

Shama Mohamed disappointed with Congress Kerala candidates list - Sakshi

కేరళలో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో తగినంత మహిళా ప్రాతినిధ్యం లేకపోవడంపై ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటీవలే పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత కూడా రానున్న లోక్‌సభ ఎన్నికలకు కేరళ నుంచి ఒక్క మహిళా అభ్యర్థిని మాత్రమే నిలబెట్టడం పట్ల కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ రాజకీయాల్లో మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని పిలుపునిస్తున్నారని, కేరళలోని పార్టీ నేతలు ఆయన పిలుపును పట్టించుకోవాలని షామా మహమ్మద్‌ కోరారు. ''మీరు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. చివరిసారి (2019లో) ఇద్దరు మహిళా అభ్యర్థులు (కేరళ నుంచి) ఉన్నారు. కానీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈసారి ఒక్కరే ఉండటం దురదృష్టకరం” అన్నారు. 

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కేరళ నుంచి కాంగ్రెస్ ప్రకటించిన 16 మంది అభ్యర్థుల జాబితాలో అలత్తూర్ నియోజకవర్గ అభ్యర్థి రమ్య హరిదాస్ ఒక్కరే ఏకైక మహిళ. కాంగ్రెస్ ముఖ్య నేత, కేరళ మాజీ సీఎం కే కరుణాకరన్ కుమార్తె పద్మజ వేణుగోపాల్..  పార్టీ తనను నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ బీజేపీలోకి ఫిరాయించిన క్రమంలో తాజాగా షామా మహమ్మద్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కాగా షామా మహమ్మద్‌ చేసిన వ్యాఖ్యలను కేరళ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్ కె సుధాకరన్ కొట్టిపారేశారు. ఆమె ప్రకటనపై మీడియా సుధాకరన్ స్పందనను కోరగా వెళ్లి ఆమెనే అడగాలని, ఆమెకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం లేదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement