
సాక్షి, శ్రీకాకుళం: అధికారం కోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఎల్లో మీడియా 'ఈనాడు'లో ఒక భజన కథనాన్ని రాయించుకున్నారని మండిపడ్డారు.
చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపే ప్రయత్నంలో భాగంగా ఏడాదిలో చంద్రబాబు ప్రజలకు ఎంతో చేశారని, మిగిలింది ఎప్పుడంటూ ఈనాడు రాసిన కథనం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గత చరిత్ర చూసినా ఎన్నడూ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమంటున్నారంటే..
చంద్రబాబు సీఎంగా ఏడాది పాలనలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఇచ్చారు. ఇంకా కొంత పెండింగ్‌లో ఉంది. వాటిని కూడా ఇచ్చేయండీ అంటూ ఈనాడు పత్రిక చంద్రబాబు పాలనను కీర్తిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు 1999, 2014, 2024లో మేనిఫేస్టోలను పార్టీ పరంగా విడుదల చేశారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఎప్పుడూ తాను మేనిఫేస్టోలో ప్రకటించిన హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలే లేవు. ప్రతిసారీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాష్ట్రం తిరోగమనంలోనే ఉంది.
పెన్షన్ల పథకం అమలులోనూ మోసం
కూటమి పాలనలో ప్రధానంగా ఇచ్చిన సూపర్ సిక్స్, అలాగే 143 హామీలను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలి. పెన్షన్ల గురించి చెబుతున్న చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు యాబై ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామని చెప్పలేదా? ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలి. అలా ఇచ్చినట్లయితే అదనంగా 20 లక్షల మంది కొత్త పెన్షన్లరు పెరగాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న 66 లక్షల పెన్షన్లకు అదనంగా మరో 20 లక్షలు కలిస్తే, మొత్తం 86 లక్షల పెన్షన్లను ప్రతినెలా ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ అలా జరుగుతోందా? పైగా వైయస్ జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటి ఉన్న పెన్షన్ల నుంచి ఏకంగా నాలుగు లక్షల పెన్షన్లకు కోత పెట్టారు. ఈ తొలగించిన పెన్షన్ల మొత్తాన్ని మిగిలిన పెన్షన్లకు కలిపి, వెయ్యి రూపాయల చొప్పున పెంచానని అబద్దాలు చెప్పుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లను కూడా భారీగా తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దివ్యాంగ పెన్షన్లు, మెడికల్ పెన్షన్లను తీసేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఇళ్ళ వద్దే పెన్షన్లు అని చెబుతున్నా కూడా వాస్తవానికి వారిని టీడీపీ నేతల ఇళ్ళకు పిలిపించుకుని, వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా పంపిణీ చేస్తున్నారు.
అధ్వాన్నంగా శాంతిభద్రతలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. దాడులు, హత్యలు, మహిళలపై లైంగిక దాడులు, కక్షసాధింపులు కనిపిస్తున్నాయి. రాజ్యాంగబద్దమైన పాలన జరగడం లేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. ఏదైనా ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే చాలు వెంటనే దానిపై డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభిస్తున్నారు. ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెచ్చి, బురదచల్లుతున్నారు. రాష్ట్రంలో ఇలా పెట్టుబడిదారుపై దాడులు, బెదిరింపులు ఎప్పుడూ చూడలేదు.
కానీ కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలపై మామూళ్ళ కోసం దాడులు, వేధింపులతో ఒక భయోత్పాతంను సృష్టించారు. శ్రీకాకుళం జిల్లాలో బ్రూవరీస్ కంపెనీని వేధించారు. అలాగే రాయలసీమలో సిమెంట్ కంపెనీలపై, పోర్ట్ల్లో రవాణా వాహనాల నుంచి మామూళ్ళ కోసం దౌర్జన్యాలకు పాల్పడ్డారు. వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో ఎంఓయులు చేసుకున్న పెట్టుబడిదారులే ఇప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలను ప్రారంభిస్తున్నారు. కూటమి హయాంలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా వచ్చిన దాఖలాలు లేవు. దావోస్‌కు వెళ్ళి వట్టి చేతులతో తిరిగి వచ్చారు.
పథకాల అమలుపై స్పష్ట ఏదీ?
రాష్ట్రంలో 1.60 కోట్ల దీపం కనెక్షన్లకు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇవ్వాలంటే రూ.4వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ.869 కోట్లు కేటాయించారు. ఇవి వాస్తవం కాదా? ప్రజలను మోసం చేయడం కాదా? ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయల చొప్పున ఇస్తామని ప్రకటించారు. 1.80 కోట్ల మంది అర్హులైన మహిళలు ఈ పథకం కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు దీనిని అమలు చేస్తారు? ఏడాదికి సుమారు రూ.32,400 కోట్లు అవసరం. ఉచిత బస్సు అన్నారు, దాని అమలు ఊసే లేదు. యువగళం అంటూ నిరుద్యోగులకు భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఎంతమంది నిరుద్యోగులకు దీనిని ఇచ్చారు? రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఇవ్వన్నీ ప్రజలను వెన్నుపోటు పొడవటం కాదా? అమ్మ ఒడి కింద గత ఏడాది పూర్తిగా దాదాపు 80 లక్షలకు పైగా విద్యార్ధులను, వారి తల్లులను దగా చేశారు. ఈ ఏడాది ఇస్తారో, ఎగ్గొడతారో తెలియదు. రైతులకు ఇస్తామన్న రైతుభరోసా ఏమయ్యిందీ? కేంద్రం ఇచ్చే దానితో కలిపి ఇచ్చే రైతుభరోసాపై గతంలో చంద్రబాబు పలుసార్లు వైయస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే దానితో కలిపే ఇస్తామని సిగ్గు లేకుండా ఎలా చెబుతున్నారు? కనీసం అలా అయినా ఇస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. అవి కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు.
రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన వైఎస్ జగన్
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను సర్వ నాశనం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి స్టేట్మెంట్ను ఈనాడులో ప్రచురించారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైంది, చేయగలిగినంత అప్పులు చేసేశాము. కొత్తగా ఏర్పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జూన్ 1న జీతాలు ఎల్లా చెల్లిస్తుందని ఆయన మాట్లాడిన దానిని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినా కూడా సీఎం వైఎస్ జగన్ దానిని గాడిలో పెట్టారు. జీతాలు, పెన్షన్లను సకాలంలో చెల్లించారు. తొలి ఏడాదిలోనే వైఎస్సార్ వాహనమిత్ర, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, సున్నావడ్డీ, లా నేస్తం, నేతన్ననేస్తం, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, కంటివెలుగు, విదేశీ విద్యాదీవెన, చేదోడు, వసతి దీవెన, విద్యాదీవెన, కాపునేస్తం, మత్స్యకార భరోసా పథకాలను 3,54,77,428 మంది లబ్దిదారులకు రూ.36,361 కోట్లు ఖర్చు చేస్తూ ఈ పథకాలను అమలు చేశాం.
దీనిలో 1.76 మంది బీసీలు, 62 లక్షల మంది ఎస్సీలు, 18.5 లక్షల మంది ఎస్టీలు, మరో 18.5 లక్షల మంది మైనార్టీలు, ఇతరులు 76 లక్షల మంది ఉన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వరుసగా మూడుసార్లు మొదటి స్థానంలో రాష్ట్రం నిలబడింది. అలాగే 2023-24 లో రాష్ట్రానికి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది 22 శాతం. పారిశ్రామిక, వ్యవసాయ గ్రోత్‌లో ప్రగతి సాధించాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూటమి పాలనలో జీడీపీ గ్రోత్ 22 శాతం తగ్గిపోయిందంటే వారి పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
2024-25కి సంబంధించి కూటమి ఏడాది పాలనలో స్టేట్ జీఎస్టీ రెవెన్యూ రూ.2652 కోట్లు అయితే, 2023-24 వైఎస్సార్సీపీ ఏడాది పాలనలో వచ్చిన రాష్ట్ర జీఏస్టీ రెవెన్యూ రూ.3499 వచ్చింది. అంటే సుమారు 24 శాతం ఆదాయం తగ్గిపోయింది. వైఎస్ జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చంద్రబాబు ప్రతిసారీ చెబుతూ ఉంటారు. 3.3 లక్షల కోట్లు వైయస్ జగన్ ప్రభుత్వంలో చేసిన అప్పులు అని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. కానీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అప్పులు రూ.1.50 లక్షల కోట్లు. ఏపీ చరిత్రలోనే అత్యధిక అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. రాష్ట్రంలో కొత్త పోర్ట్‌లను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చిందే వైఎస్ జగన్.