
సాక్షి, సంగారెడ్డి: హత్నూర మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య పెద్ద రచ్చే జరిగింది. సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం కోసం కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. పాలాభిషేకం వద్దని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వారించారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా.. బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణ నెలకొంది. మరోవైపు, పాలాభిషేకం చేయకుండా బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల పార్టీ శ్రేణులు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా నాయకులను చెదరగొట్టారు.