‘ఏడేళ్లైనా ఓటుకు నోటు కేసులో బాబు వాయిస్‌పై క్లారిటీ లేదు’

Sajjala Ramakrishna Reddy Takes On Chandrababu Naidu - Sakshi

తాడేపల్లి: తాను ప్రజల్లో మనిషి కాదనే విషయం చంద్రబాబు నాయుడుకు తెలుసని, అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 2019లో ఘోరంగా ఓటమి పాలై వెంటిలేటర్‌ మీదకు చేరుకున్న పార్టీ టీడీపీ అని సజ్జల పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం మాట్లాడిన సజ్జల.. ఈ మూడేళ్లలో వచ్చిన ప్రతీ ఎన్నికలోనూ టీడీపీ ఘోర పరాభవం చూసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నాయకులు నిద్రలో మళ్లీ తామే వస్తున్నామని అంటూ కలవరింతలు పలుకుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. వారికి వారు కార్యకర్తల్లో నిరాశను తొలగించడానికి సెల్ఫ్‌ హిప్నాటిజం చేసుకుంటున్నారన్నారు.

‘కాకమ్మ కథలు, పుక్కిటి పురాణాలతో కాస్త భ్రమ కలిగించవచ్చు కానీ ఫలితం ఉండదు. ఎన్నికల తర్వాత చంద్రబాబు పిల్లి మొగ్గల్లో ఏమాత్రం తేడా రాలేదు. తనని రిజెక్ట్ చేసి మూడేళ్ళయ్యింది...ఆ విషయం ఆయనకు గుర్తుకు రావడం లేదు.  ఢిల్లీ వెళ్లి చంద్రబాబు ఏదేదో ప్రచారం చేస్తున్నారు.ప్రధాని మోదీనే ఈయనను పిలిచినట్లు కలరింగ్‌ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఊతకర్ర కోసం చూస్తున్నారు.ఏపీలో బీజేపీ సహకారం కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది. నాయకుడు ఎలా ఉండకూడదో చంద్రబాబుకి చూపారు..ఎలా ఉండాలో జగన్‌ చూపించారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల నుంచి వచ్చిన పార్టీ మాది. చంద్రబాబు మొదటి నుంచీ ఎవరో ఒకరితో పోయాడు. నేను ప్రజల్లో మనిషిని కాదని చంద్రబాబుకి తెలుసు. ప్రజలకు ఏమి కావాలో సీఎం జగన్‌కు తెలుసు’ అని సజ్జల స్పష్టం చేశారు. 

బ్రీఫ్‌డ్‌ మీ అన్నది చంద్రబాబు కాదా?
2015లో ఒక ఎమ్మెల్సీ కోసం చంద్రబాబు నాయుడు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే.. ఆ వాయిస్‌ తనది కాదని బాబు చెప్పారని, ఇప్పటికీ ఆ వాయిస్‌పై క్లారిటీ రాలేదనే విషయాన్ని సజ్జల ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుది ఒరిజినల్‌ వాయిస్‌ కాదా?, ఏడేళ్లైనా ఓటుకు నోటు కేసులో బాబు వాయిస్‌పై క్లారిటీ లేదు.  కానీ చంద్రబాబు వాయిస్‌ ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసేలా ఉంది. అలాంటి వాడు సీఎంగా, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చేశారు కదా. రాత్రికి రాత్రి పారిపోయి వచ్చిన చరిత్ర అందరికీ తెలుసు. బ్రీఫ్‌డ్‌ మీ అన్నది చంద్రబాబుది కాదా?’ అని సజ్జల ప్రశ్నించారు.  ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించి అది మార్ఫింగ్‌ వీడియో కాదని తేలితే తప్పక చర్యలుంటాయని సజ్జల స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదని సజ్జల పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top