
మహిళలను అవమాన పరచడం, కించ పరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇంట్లో మహిళలు ఏమనుకుంటారోనన్న కనీస స్పృహ లేకుండా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ మహిళా నేతలపై నిస్సిగ్గుగా నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారికను అసభ్యంగా దూషిస్తూ.. ఆమె వాహనంపై టీడీపీ సైకో మూకలు దాడి చేసిన ఘటనపై రాష్ట్రం అట్టుడుకుతుండగా.. మరో వైపు మాజీ మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం సిగ్గు పడేలా దుర్భాషలాడుతూ ఐ టీడీపీ, చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రెచ్చిపోయారు.
సాక్షి, అమరావతి/నగరి: పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్‌కే రోజా గురువారం చిత్తూరు జిల్లా నగరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించక పోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
‘నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. నన్ను అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తున్నాం? ఇది ప్రమాదకరమైన సంస్కృతి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భాను ప్రకాష్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
పవన్ కల్యాణ్ స్పందించాలి
మహిళా లోకం అసహ్యించుకొనేలా.. సభ్య సమాజం తల దించుకునేలా మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడటం దారుణం అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. ‘సినిమా వాళ్లు అంటే ఎందుకు మీకు ఇంత చులకన? మీరు నెత్తిన ఎక్కించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదా?’ అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలి అని ఆమె డిమాండ్ చేశారు. నగరి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు.
కౌన్సిలర్ల అక్రమ అరెస్ట్‌పై నిలదీసిన రోజా
పుత్తూరు: తమిళనాడుకు ఏడు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తూ నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ బ్యాచ్ పట్టుబడగా.. తప్పుడు వాంగ్మూలంతో పోలీసులు ఇద్దరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. వివరాలు.. ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఏడు టిప్పర్లను ఇటీవల నగరి పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి అయిన భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అనుచరుడైన భరత్ ఇచ్చిన తప్పుడు వాంగ్మూలంతో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బీడీ భాస్కర్, బిలాల్‌పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి.. బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వారిని గురువారం ఉదయం 11 గంటలకు పుత్తూరు సబ్ కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా పుత్తూరు కోర్టు వద్దకు చేరుకుని ఎస్సై విజయ్‌ను పలు ప్రశ్నలతో నిలదీశారు. ఇసుకను ఎక్కడ అక్రమంగా తరలిస్తుంటే వీరిని పట్టుకున్నారో సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ప్రజాప్రతినిధులను అర్ధరాత్రి సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశి్నంచారు. అసలు రాజంపేట నుంచి నగరి మీదుగా తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలించడం వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు సాధ్యపడే విషయమేనా అని నిలదీశారు. అన్ని ప్రశ్నలకూ సీఐని అడగాలంటూ ఎస్సై నీళ్లునమిలారు. ఇసుక మాఫియాకు ప్రధాన సూత్రధారి అయిన గాలి భానుప్రకాశ్ ప్రధాన అనుచరుడు భరత్ నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకొని.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై అక్రమ కేసులు బనాయించారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. తప్పుడు కేసులకు భయపడే పరిస్థితిలో లేమని.. పార్టీ కేడర్‌కు వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు వైఎస్ జగన్ అండగా ఉన్నారని చెప్పారు.
