అమలు గ్యారంటీ | Sakshi
Sakshi News home page

అమలు గ్యారంటీ

Published Sat, Nov 11 2023 3:44 AM

Revanth Reddy Nomination  - Sakshi

సాక్షి, కామారెడ్డి: కర్ణాటకలో కాంగ్రెస్‌ హామీలు నెరవేర్చడం లేదని, తెలంగాణలో ఏం అమలు చేస్తుందంటూ సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. హామీలు అమలవుతున్నాయో లేదో వచ్చి చూడాలని కేసీఆర్‌ను ఆహా్వనిస్తే ముఖం చాటేశారని.. పైగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో తాము ఇచ్చిన ‘గ్యారంటీ’ హామీలను అమల్లోకి తెచ్చామని.. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నామినేషన్‌ వేశారు.

అనంతరం పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించి పార్టీ తరఫున బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ మిత్రపక్షాలు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, నేత చాడ వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు. సభలో సిద్ధరామయ్య ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘కర్ణాటకలో మేం ఇచ్చిన ఐదు గ్యారంటీల్లో 4 గ్యారంటీలు 2 నెలలుగా అమలవుతూనే ఉన్నాయి. యువనిధి పథకాన్ని జనవరిలో మొదలు పెడుతున్నాం. మేం ప్రజలకు ఇచ్చిన హామీల మేర కు అన్ని పథకాలను అమలు చేస్తుంటే ఇక్కడి సీఎం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.  మేం అమలు చేస్తున్న పథకాలు నిజమో కాదో తెలుసుకునేందుకు రమ్మని పిలిస్తే ముఖం చాటేస్తున్నారు. కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు తెలంగాణలో కేసీఆర్‌ గొప్పలు చెప్పడం తప్ప చేసిందేమీలేదు. బీసీలకు 34శాతంగా ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. సీఎం కేసీఆర్‌కు అవినీతి డబ్బులతో ఎన్నికలకు వెళ్లడం అలవాటు. ఈసారి ఆయన ప్రయత్నాలు ఫలించవు. ప్రజలు ఆయనకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. కామారెడ్డిలో ప్రజల స్పందన చూస్తుంటే కేసీఆర్‌ ఓడిపోవడం ఖాయమని తేలిపోతోంది. ప్రజలు 30వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. 

మోదీ ప్రచారం చేసినా బీజేపీ ఓడింది 
తెలంగాణలో బీజేపీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కు వ. మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు. కర్ణాటకలో ప్రధాని మోదీ 48 రోడ్‌షోలు, సభల్లో పాల్గొన్నారు. ఆయన సభలు జరిపిన చోటల్లా కాంగ్రెస్‌ ఎక్కువ మెజారిటీతో గెలిచింది. మోదీకి అక్కడి ఓటర్లు బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్న మోదీకి ఇక్కడి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ వేరు కాదు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ బీ టీంగా పనిచేస్తోంది. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అండగా ఉండేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. తెలంగాణలో బీసీ డిక్లరేషన్‌ కచి్చతంగా అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలి..’’అని సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. 

ద్రోహులను పక్కన పెట్టుకుని నీతులా?: రేవంత్‌ 
ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద కేసీఆర్‌ మాట్లాడటమంటే వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దివంగత సీఎం వైఎస్సార్‌తోపాటు మరెందరో సీఎంలు రోజూ ప్రజల సమస్యలు వినేందుకు దర్బార్‌ నిర్వహించేవారని, సీఎం కేసీఆర్‌ పదేళ్లలో ఒక్కనాడూ ప్రజల కష్టాలు విన్నపాపాన పోలేదని మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ఆ వివరాలు రేవంత్‌ మాటల్లోనే..  
‘‘ఎమ్మెల్యేను యాభై లక్షలకు కొంటూ రేవంత్‌ దొరి కిండని అంటున్న కేసీఆరే తెలంగాణను కొనుగోళ్లు, అమ్మకాలకు కేంద్రంగా మార్చారు. 40 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, 12 మంది ఎమ్మెల్సీలు, వందలాది మంది ఎంపీపీలు, జెడ్పీటీసీలను కొనుగోలు చేసిండు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద సీబీఐ విచారణకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధ మా? సిద్ధమైతే 24 గంటల్లో సీబీఐకి లేఖ రాయాలి.  

అమ్మ పుట్టిన ప్రాంతమని గుర్తుకు రాలేదా? 
కామారెడ్డి ప్రాంతానికి చెందిన రైతు లింబయ్య 2017లో తన కష్టాన్ని చెప్పుకోవాలని వచి్చ, సీఎం అవకాశం ఇవ్వలేదన్న ఆవేదనతో సెక్రటేరియట్‌ ఎదురుగా ఉరివేసుకుని చనిపోయినపుడు.. ఇదే ప్రాంతానికి చెందిన బీరయ్య అనే రైతు వడ్ల కుప్పమీద చనిపోయినపుడు.. సీఎం కేసీఆర్‌కు కామారెడ్డి తన తల్లి పుట్టిన ప్రాంతమని గుర్తుకురాలేదా? ఇప్పుడు గజ్వేల్‌ ప్రజలు నమ్మే స్థితిలో లేక కామారెడ్డికి వచ్చి పోటీ చేçస్తున్నప్పుడు గుర్తుకువచ్చిందా? కామారెడ్డి ప్రజలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. మీ తీర్పు కోసం దేశ, విదేశాల్లో ఎదురు చూస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకే నేను కామారెడ్డి వచ్చా. 
భూములు కొల్లగొట్టేందుకు వస్తున్నారు 

కామారెడ్డిని బంగారు తునక జేస్తనంటున్న కేసీఆర్‌ గజ్వేల్‌కు ఏం చేశారు. అక్కడి ప్రజలను ముంచి, రోడ్డున పడేసి ఇప్పుడు కామారెడ్డి మీద కన్నేశారు. ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములను కొల్లగొట్టేందుకు వస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో కుట్ర చేశారు. రైతులు తిరగబడటంతో మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేసినట్టు ఆయన కొడుకు కేటీఆర్‌ చెప్తున్నారు. వారి మాటలు నమ్మవద్దు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. రూ.2 లక్షల దాకా రైతుల రుణాలు మాఫీ చేస్తాం. ఆరు గ్యారంటీలను, బీసీ డిక్లరేషన్‌ను పక్కాగా అమలు చేస్తాం.’’ అని రేవంత్‌ ప్రకటించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్‌ గాలిని జూసి సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందని సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. 

రేవంత్‌కు ‘కోనాపూర్‌’నామినేషన్‌ డబ్బులు 
కామారెడ్డి నుంచి పోటీచేస్తున్న రేవంత్‌రెడ్డి నామినేషన్‌ కోసం కేసీఆర్‌ పూర్వీకుల గ్రామమైన కోనాపూర్‌ వాసులు డబ్బును అందజేశారు. కేసీఆర్‌కు పదేళ్లుగా కోనాపూర్‌ గుర్తుకురాలేదని, ఇప్పుడు ఓట్ల కోసం తమ ఊరి పేరు వాడుకుంటున్నారని వారు విమర్శించారు. కాగా సభలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య కన్నడ భాషలో ప్రసంగించగా.. కాంగ్రెస్‌ నేతలు తెలుగులోకి అనువాదం చేశారు. ఇది చాలా నిదానంగా సాగడంతో సభకు హాజరైనవారిలో నిరాశ కనిపించింది. సభలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ నేతలు పొన్నం ప్రభాకర్, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీగౌడ్, సుదర్శన్‌రెడ్డి, మదన్‌మోహన్, ఆది శ్రీనివాస్, అరికెల నర్సారెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్‌కు గుణపాఠం తప్పదు: నారాయణ 
తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా మోసగించిన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్‌ తెలంగాణ ద్రోహులు, వ్యతిరేకులను చంకనెత్తుకుని ఊరేగుతున్నారని మండిపడ్డారు. కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్సార్‌ ప్రజల సమస్య లు వినేందుకు రోజూ ప్రజా దర్బార్‌ నిర్వహించేవారని.. ఈ పదేళ్లలో ఒక్కరోజు కూడా ప్రజలు సీఎంను కలిసే అవకాశం దొరకలేదని సీపీఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. 

ప్రశ్నించే గొంతులను నొక్కేశారు: కోదండరాం 
ఎన్నెన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పో యిందని, ప్రశ్నించేవారి గొంతులను నొక్కేస్తున్నారని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీ లేదని, పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని ఆరోపించారు. ఈ అన్యాయాలు చూస్తుంటే గుండెలు మండుతున్నాయన్నారు. కామారెడ్డి ప్రజలు ఓటుతో బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.  

ఇదీ చదవండి: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement