Revanth Reddy: ఏ సెంటర్‌కైనా రెడీ!.. కాళ్లూ చేతులు ఎలా విరుస్తావో చూస్తా..

Revanth Reddy Comments On KCR At Munuguru In Hath Se Hath Jodo - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ప్రగతి భవన్‌ పేల్చేయాలి అన్నోళ్ల కాళ్లూ చేతులు విరిచేస్తానంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో మాట్లాడారు. నా కాళ్లూ చేతులు ఎలా విరుస్తారో చూస్తా? ఏ సెంటర్‌కు రమ్మంటావో చెప్పు.. అమరవీరుల స్తూపం, మేడారం, అసెంబ్లీ, యాదాద్రి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు ఏం చేస్తావో చూస్తా’అంటూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తాను మాట పడే మనిషిని కాదన్నారు.

హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా సోమవారం సాయంత్రం మణుగూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పిన కేసీఆర్‌ ఆ తర్వాత మాట మర్చారని విమర్శించారు. నోట్ల రద్దు సహా అనేక అంశాల్లో మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఇప్పుడు మోదీ కంటే నాటి మన్మోహన్‌సింగ్‌ పాలనే బాగుందని చెబుతున్నారని, ఇలా ఎటు పడితే అటు మాట్లాడే మనిషి కేసీఆర్‌ అని దుయ్యబట్టారు.

తెలంగాణ ప్రకటన వెనక్కి పోయినప్పుడు జానారెడ్డి ఆధ్వర్యంలో కోదండరాం నేతృత్వంలో రాజకీయ జేఏసీ ఏర్పాటైందని రేవంత్‌ గుర్తుచేశారు. అçప్పుడు దండాలు పెట్టి, జెండాలు మోసి ప్రజలంతా ఉద్యమం చేస్తే ఇçప్పుడు ఆ ప్రజలనే కేసీఆర్‌ ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను చైతన్య పరిచేందుకు గళం విప్పి గజ్జె కట్టాలంటూ కళాకారులను కోరారు.  

చారిత్రక అవసరం... 
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని రేవంత్‌రెడ్డి అన్నారు. నాయకులు మోసం చేసినా కార్యకర్తలు పారీ్టకి అండగా నిలవాలని కోరారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అని చెప్పిన మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ సిలిండర్ల ధరను డబుల్, ట్రిపుల్‌ చేసిందని విమర్శించారు. అక్కడ మోదీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ అని, బీఆర్‌ ఎస్‌ దొరల పార్టీ అని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ఒక్కటే ప్రజల పార్టీ అని రేవంత్‌ అన్నా రు. దళితుడైన మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా చేశామని, తెలంగాణలో దళితుడిని సీఎంగా చేయకపోయినా కనీసం పార్టీ అధ్యక్షుడిగా అయినా చేసే దమ్ముందా? అని బీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. 

అధికారంలోకి వస్తే రుణమాఫీ: తొమ్మిదేళ్లలో పరిష్కారం కాని పోడు భూముల సమస్య ఈ 9 నెలల్లో పరిష్కారం అవుతుందనే నమ్మకం లేదని రేవంత్‌ పేర్కొన్నారు. అవసరమైతే కాలనాగునైనా, అనకొండనైనా, కొండ చిలువనైనా కౌగిలించుకుంటాం కానీ దోఖే బాజీ కల్వకుంట్ల కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబోమని రేవంత్‌ స్పష్టం చేశారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని... అప్పుడు రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేస్తామన్నారు. పేదలకు ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బీటీపీఎస్, సింగరేణి, ఆర్టీసీ కారి్మకులు, విద్యుత్‌ ఉద్యోగుల కష్టాలను తీరుస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. 

రేవంత్‌ పాదయాత్రకు సీపీఐ నేతల సంఘీభావం... 
భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా సీపీఐ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకొని సంఘీభావం తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఐ నడుమ పొత్తు కుదురుతుందన్న ప్రచారం నేపథ్యంలో సీపీఐ కార్యకర్తలు రేవంత్‌ పాదయాత్రలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top