ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ నటించిన జన నాయకన్ సినిమాకు ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలపడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్‌లో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి వ్యూహాత్మకంగా రాహుల్ పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి,
వ్యూహాత్మక ఎత్తుగడా.?
రాహుల్ గాంధీ తాజా ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీ,.. డీఎంకేతో ఉన్న దీర్ఘకాలిక కూటమి కొనసాగుతుందా? లేక విజయ్ పార్టీ టీవీకేతో కలిసి కొత్త వ్యూహం రూపొందిస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి.2017లో విజయ్ నటించిన మెర్సల్ సినిమా మీద కేంద్రం అభ్యంతరాలు తెలిపినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఆయనకు మద్దతు ఇచ్చారు. ఒకవైప విజయ్.. తమిళ రాజకీయాల్లో బలంగా ఎదిగే అవకాశం ఉండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే టీవీకేతో పొత్తుకు రాహుల్ గాంధీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, దీనిలో భాగంగానే విజయ్‌కు మరోసారి మద్దతు పలికారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
The I&B Ministry’s attempt to block ‘Jana Nayagan’ is an attack on Tamil culture.
Mr Modi, you will never succeed in suppressing the voice of the Tamil people.— Rahul Gandhi (@RahulGandhi) January 13, 2026
అయితే డీఎంకేతోనే పొత్తు కొనసాగించాలని అధిక శాతం మంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పుడూ ఒక పార్టీనే అధికారంలో ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి.. విజయ్‌కు ఈ రకంగా రాహుల్ మద్దతు ఇవ్వడం వ్యూహాత్మక ఎత్తుగడగా ఆ పార్టీకి చెందినే పలువురు నేతలు అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణ, ఆయన సినిమాలపై కేంద్రం చూపుతున్న అడ్డంకులు, కాంగ్రెస్ పార్టీకి కొత్త అవకాశాలను తెచ్చేలా కనిపిస్తున్నాయి.
గతంలో కూడా చర్చ..
కొన్ని రోజుల క్రితం కూడా కాంగ్రెస్-టీవీకేల పొత్తు అంశానికి సంబంధించి చర్చ వచ్చింది. ఇరు పార్టీలు త్వరలో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే అధికారంలో ఉన్న డీఎంకేతో బంధం తెంచుకోవడం మంచిది కాదని కాంగ్రెస్‌లోని ఒక వర్గం భావిస్తోంది. దాంతోనే విజయ్ పార్టీతో పొత్తుపై అధిష్టానం కూడా ఎటువంటి ముందుకు సాగడం లేదు. కేవలం మద్దతు ఇస్తూ ట్వీట్లు పెట్టడం తప్పితే ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోకాంగ్రెస్ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డీఎంకే పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందనే అంశాన్ని అతి దగ్గరగా పర్యవేక్షిస్తోంది.


