అదానీకి దోచిపెట్టడమే విదేశాంగ విధానమా? మోదీ తొమ్మిదేళ్లుగా దేశాన్ని భ్రమల్లోనే ఉంచుతున్నారు..

Rahul Gandhi Slams PM Modi Over Foreign Policy Adani - Sakshi

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీని కుబేరుడిని చేయడమే మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానామా? అని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. నరేంద్ర మోదీ గత తొమ్మిదేళ్లుగా దేశాన్ని భ్రమల్లోనే ఉంచుతున్నారని, తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచంలో మోదీ ఎక్కడికెళ్లినా అదానీని సైతం వెంట తీసుకెళ్లారని గుర్తుచేశారు. 

ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణం: జైరాం  
పార్లమెంట్‌లో ప్రతిష్టంభనకు ముమ్మాటికీ మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. కీలకమైన అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడం ప్రధాని మోదీకి, ఆయన సహచరులకు ఒక అలవాటుగా మారిందన్నారు.  రాహుల్‌ విమర్శలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్‌ సింగ్‌ ఖండించారు. కాంగ్రెస్‌ హయాంలోనే అదానీ వ్యాపారావేత్తగా ఎదిగారన్నారు. ‘‘గుజరాత్‌ కాంగ్రెస్‌ సీఎం చిమన్‌భాయ్‌ పటేల్‌ తనకు మొదటి బ్రేక్, రాజీవ్‌ గాంధీ రెండో బ్రేక్‌ ఇచ్చారని అదానీ స్వయంగా చెప్పారు. ప్రధాని మోదీని దూషించడమే ప్రతిపక్షాల ఉద్దేశం. అంబానీ–అదానీ సాకులే. యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలన వివాదాలమయం. మోదీ సర్కారు వచ్చాకే అభివృద్ధి జరుగుతోంది’’ అన్నారు.

ప్రమాదంలో భావప్రకటనా స్వేచ్ఛ: ఖర్గే  
మాట్లాడే స్వాతంత్య్రం, నిజాలు రాసే స్వేచ్ఛ ప్రమాదంలో చిక్కుకున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లోక్‌మత్‌ జాతీయ సదస్సులో ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు మీడియాను అణచివేస్తున్నారని ఆరోపించారు. ఓ వర్గం మీడియా వారికి లొంగిపోయిందని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీ కేంబ్రిడ్జి అరుపులు, లండన్‌ అబద్ధాలు ఆపాలని సదస్సులో పాల్గొన్న కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హితవు పలికారు. విపక్ష నేతలను వేధించేందుకే దర్యాప్తు సంస్థలను కేంద్రం ప్రయోగిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు.
చదవండి: ఎన్నిసార్లు ఇలానే చేస్తారు.. స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్‌ను మార్చుకోండి..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top