
స్పీకర్, డిప్యూటీ స్పీకర్ యత్నాలు
మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి
ఒక్కరికే చాన్స్ అంటున్న టీడీపీ వర్గాలు
సాక్షి, అమరావతి: చట్టసభల్లో కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు తమకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఒకేసారి కోరుతుండడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులు తమను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో కొత్తగా కొందరు సీనియర్లను క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని చాలా రోజులుగా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పనితీరు మార్చుకోకపోతే పదవుల నుంచి తప్పిస్తానని పదేపదే హెచ్చరిస్తున్నారు. ఏడాదిగానే ప్రతిపక్షం మరింత చురుగ్గా వ్యవహరిస్తోందని, వైఎస్సార్‌సీపీని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నామని, ఈ విషయంలో మంత్రులు విఫలమవుతున్నారనే అభిప్రాయం చంద్రబాబులో బలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
వైఎస్ జగన్, వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా రాయించడం, వ్యతిరేక వార్తలు ప్రసారం చేయించడం ద్వారా బురద చల్లడం మినహా మంత్రులెవరూ విపక్షాన్ని ఎదుర్కోలేకపోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదన తెరపైకి రావడంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెబుతున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సీనియర్ నేతగా ఉన్న అయ్యన్నపాత్రుడు తనకు మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని భావించారు. అయితే ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. ఇక డిప్యూటీ స్పీకర్ హోదాలో రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన రఘురామ నేరుగా కొన్ని టీవీ ఛానళ్ల డిబేట్లలో పాల్గొంటూ తనకు ఆ రూలు వర్తించదనే రీతిలో వ్యవహరిస్తున్నారు.
రాజకీయ ప్రయోజనాల కోణంలో అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం చంద్రబాబులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు లోకేష్ అంగీకరించడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.