ప్రధాని మోదీ ప్రసంగంతో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

PM MODI In Hyderabad: BJP National Executive Meet Day 2 Live Updates - Sakshi

Live Updates:

పటేల్‌ వల్లే ఈరోజు దేశంలో తెలంగాణలో ఉంది: ప్రధాని మోదీ
రెండు రోజులు పాటు సాగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. తెలంగాణ అంశంతో ప్రధాని మోదీ ప్రసంగం ముగిసింది. పటేల్‌ వల్లే ఈరోజు దేశంలో తెలంగాణలో ఉందని ప్రధాని అన్నారు. 119 నియోజకవర్గాలకు వెళ్లిన జాతీయ ప్రతినిధులను మోదీ అభినందించారు. యూపీ ఉప ఎన్నికల విజయం స్ఫూర్తితో పని చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అట్టడుగు వర్గాలకు బీజేపీ చేరువ కావాలన్నారు. హిందువులకు మాత్రమే కాదు.. అన్ని మతాలకు చేరువకావాలన్నారు.

30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండాలి: అమిత్‌షా
దేశంలో అన్ని వర్గాలకు బీజేపీ చేరువ కావాలని అమిత్‌ షా పిలుపునిచ్చారు. దేశంతో పాటు రాష్ట్రాల్లో 30 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండాలన్నారు. ఇందుకోసం కార్యాచరణ తయారు చేయాలని అమిత్‌ షా సూచించారు.

తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు..
తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్‌ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది.

డ్రైవింగ్‌ సీట్‌లో కేసీఆర్‌.. స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో..
టీఆర్‌ఎస్‌ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ సమావేశాలను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నాలు చేసిందన్నారు. బీజేపీకి పోటీగా నగరం మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజాధనాన్ని ఫ్లైక్సీలకు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్నా స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

ఒకే కుటుంబం చేతిలో తెలంగాణ బందీ: బండి సంజయ్‌
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు విలువనిచ్చి బీజేపీ మద్దతిచ్చిందని బండి సంజయ్‌ అన్నారు. ఆశలు, ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణలో పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను సీఎం కేసీఆర్‌ గాలికొదిలేశారన్నారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని దుయ్యబట్టారు.

తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర: పీయూష్‌ గోయల్‌
టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి పెరిగిపోయిందని పీయూష్‌ గోయల్‌ అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణలో ప్రజలు కష్టాలు పెరుగుతున్నాయి. తెలంగాణ కోసం ఎందరో త్యాగాలు చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రధానాంశాలుగా పీయూష్‌ పేర్కొన్నారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈటల ప్రసంగాన్ని అభినందించిన ప్రధాని మోదీ
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రత్యేకంగా ఆయన ప్రసంగించారు. 15 నిమిషాలు ఈటల ప్రసంగించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, కేసీఆర్‌ వైఫల్యాలు, ప్రభుత్వ అవినీతిని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం అంశాలను ఈటల ప్రస్తావించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీగా బీజేపీని నమ్ముతున్నారన్నారు. ప్రజలకు మరింత నమ్మకం కలిగిస్తే బీజేపీని ఆదరిస్తారని ఈటల అన్నారు. ఈటల ప్రసంగాన్ని ప్రధాని మోదీ, జేపీ నడ్డా అభినందించారు.

బీజేపీ విజయ సంకల్ప సభ..
సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యవర్గ సమావేశాలు అనంతరం సాయంత్రం.. ప్రధాని మోదీ హెచ్‌ఐసీసీ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరు​​కుని  అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు. రాత్రికి ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. 

కాంగ్రెస్‌పై మండిపడ్డ హిమంత
గుజరాత్‌ అల్లర్లపై మోదీపై తీవ్రమైన దుష్ప్రచారం చేశారని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ధ్వజమెత్తారు. రాహుల్‌పై అవినీతి ఆరోపణలు వస్తే కాంగ్రెస్‌ ఎదురుదాడి దిగుతుందని, రామజన్మభూమిలో ఆలయం నిర్మాణాన్నికాంగ్రెస్‌ వ్యతిరేకించిందన్నారు. సర్జికల్‌ స్ట్రైక్‌పైనా కాంగ్రెస్‌ అనుమానం వ్యక్తం చేసిందని హిమంత మండిపడ్డారు. గతంలో కులం, మతం ఆధారంగా ఎన్నికలు  జరిగేవి, ఇప్పుడు అభివృద్ధి  కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయని హిమంత అన్నారు.

రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం..
సాక్షి, హైదరాబాద్‌: రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. కేంద్రమంత్రి హోంమంత్రి రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. కర్ణాటక, అసోం సీఎంలు తీర్మానాన్ని బలపరిచారు. గుజరాత్‌ అల్లర్లలో మోదీకి సుప్రీం కోర్టు క్లీన్‌చిట్‌ విషయాన్ని అమిత్‌ షా ప్రస్తావించారు.  తీర్మానాల్లో తెలంగాణపై చర్చ జరిగింది. తెలంగాణలో కుటుంబ పాలన అంతం చేయాలని తీర్మానం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top