People Fires On TDP Leader Bandaru Satyanarayana Murthy - Sakshi
Sakshi News home page

AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు!

Jan 4 2022 5:20 AM | Updated on Jan 4 2022 9:31 AM

People Fires On TDP Leader Bandaru Satyanarayana Murthy - Sakshi

చింతగట్లలో టీడీపీ నేతలపై తిరగబడుతున్న జగనన్న కాలనీ లబ్ధిదారులు

పెందుర్తి: ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తే జనం ప్రతిఘటన ఎలా ఉంటుందో విశాఖ ప్రజలు టీడీపీ నేతలకు రుచి చూపించారు. వారికి గట్టిగా బుద్ధి చెప్పి, అక్కడి నుంచి పారిపోయేలా చేశారు.  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయనతోపాటు వచ్చిన వారికి విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇప్పిలివానిపాలెంలో సోమవారం ఎదురైన భంగపాటిది. నిరుపేదలకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కుట్రపూరితంగా అడ్డుకోవాలన్న వారి దుర్మార్గపు ఆలోచనకు ప్రజలు తీవ్ర స్థాయిలో బదులిచ్చారు. ప్రజలంతా తిరగబడ్డంతో ›‘40’ ఏళ్ల అనుభవం అక్కడి నుంచి పారిపోయింది.

పారని ‘పచ్చ’ పాచిక
ఇప్పిలివానిపాలెం సర్వే నెంబర్‌ 81/2లో ప్రభుత్వం నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు కేటాయించింది. మొత్తం 90 మంది లబ్ధిదారులు ఈ లేఅవుట్‌లో స్థలాలు పొందారు. వారిలో కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదులు నింపేందుకు çసమీపంలోని కొండవాలు ప్రాంతం నుంచి మట్టిని సేకరిస్తున్నారు. దీన్ని రాజకీయం చేయాలన్న కుట్రతో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బండారుకు సమాచారం ఇచ్చారు. వెంటనే బండారు సత్యనారాయణమూర్తి, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాస్‌ తమ అనుచరులను వెంటేసుకుని లేఅవుట్‌ వద్దకు వచ్చారు. ఇక్కడి మట్టిని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు అమ్ముకుంటున్నారని, ఎవరూ తవ్వడానికి వీల్లేదని అంటూ వీరంగం వేశారు.

ఇళ్ల కోసం మట్టిని తవ్వుకుంటున్నామని పేదలు చెప్పినా వినలేదు. తీవ్రస్థాయిలో అక్కడ రచ్చ చేసే ప్రయత్నం చేశారు. దీంతో చిర్రెక్కిన పేదలు టీడీపీ మూకపై తిరగబడ్డారు. మట్టిని ఎవరు అమ్ముకుంటున్నారో నిరూపించాలని నిలదీశారు. ‘మీ ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేదకైనా ఇళ్లు ఇచ్చారా? జగన్‌బాబు (సీఎం వైఎస్‌ జగన్‌) వచ్చిన తరువాత మాకందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇళ్లు కట్టిస్తున్నాడు. మా బతుకులు మేం బతుకుతుంటే మీరెందుకు మా బతుకుల్లో నిప్పులు పోయాలని చూస్తారు? మీ రాజకీయాల కోసం మాలాంటి వాళ్లను ఇబ్బంది పెడతారా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి కుట్రలు చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘మీరు పేదల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? మంచి పనిని కూడా ఇలా చెడగొడతారా? మీకు సిగ్గూ శరం లేదా?’ అంటూ మహిళలు మండిపడ్డారు. పేదల ఆగ్రహావేశాలను చూసిన బండారు బృందానికి నోట మాట రాలేదు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని పేదలు మరోసారి హెచ్చరించడంతో బండారు, పీలా తదితరులు వెనక్కి మళ్లారు. ఏం చేయాలో పాలుపోని బండారు లే అవుట్‌ సమీపంలో ఓ చెట్టు కిందకు వెళ్లి కాసేపు మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి తర్వాత తేరుకొని, యథావిధిగా ప్రభుత్వంపై విమర్శలు చేసి ఇంటి దారి పట్టారు. బండారు, టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement