
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు సీఎం జగన్ ఫోబియా పట్టుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జగన్ చరిష్మాను, ఆయన ప్రజాబలాన్ని చూసి టీడీపీ అధినేతకు రోజురోజుకు మతిచలించిపోతోందని, దీంతో బలవంతపు ఏకగ్రీవాలంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ తొలిదశ ఫలితాలను జీర్ణించుకోలేకపోతున్నారని, కుప్పంలోనూ టీడీపీ మద్దతుదారుల ఓటమితో పూర్తిగా మతిభ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అన్నట్టుగా తాను పోటుగాడినేగానీ ఆయనలా వెన్నుపోటుదారుడిని కాదన్నారు. చిత్తూరు జిల్లాలో బాబుకన్నా ఎక్కువగా ప్రజాబలం తనకుందని, అది చూసి ఓర్చుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం సహకరిస్తున్నందునే ప్రశాంతం
పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నందునే ప్రశాంతంగా జరుగుతున్నాయని పెద్దిరెడ్డి అన్నారు. రౌడీలు, దుర్మార్గాలు, బలవంతపు ఏకగ్రీవాలంటూ చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమన్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర చేసిందేంటని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు కేంద్ర బలగాలను పంపాలంటూ చంద్రబాబు కోరడాన్ని తప్పుపట్టారు. బాబు పదవిలో ఉన్నప్పుడు కేంద్ర బలగాలు, విదేశాల నుంచి సిబ్బందిని తెప్పించారా? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని చిత్తూరు జిల్లాలో స్థానికంగా టీడీపీ నేతలు చెబుతున్నారన్నారు. జగన్ సంక్షేమ పాలనకు జనం నీరాజనం పలుకుతున్నారని చెప్పారు.
తప్పుడు ఆరోపణలు సరికాదు..
పోస్కో అనేది అంతర్జాతీయ సంస్థ అని, ఆ సంస్థ ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగానే కలిశారని పెద్దిరెడ్డి చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలంటే పోస్కో ప్రతినిధులు సీఎంను కలవాల్సిన అవసరం ఉండదన్నారు. అందుకోసం ప్రధానిని లేదా కేంద్ర మంత్రులను కలిసేవారన్నారు. సీఎం కుట్ర చేశారని, స్టీల్ ఫ్యాక్టరీని అమ్ముతున్నారంటూ చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. గతంలో విశాఖ ఉద్యమం జరిగినప్పుడు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలకంగా వ్యవహరించారని, ఆయన కేంద్రంతో చెప్పి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరింపజేస్తే బాగుంటుందని పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు.