
హైదరాబాద్: వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఇంకా క్లారిటీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పొత్తులపై మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని అంబటి తప్పుబట్టారు. ఆదివారం ‘సాక్షి’ స్టూడియోకి వచ్చిన అంబటి.. అసలు పవన్ కల్యాణ్‌కు ఇంకా క్లారిటీ లేదని ఆరోపించారు. ‘చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయమా?, ఎవరిదో పల్లకి మోయడానికి ఆప్షన్లు ఎందుకు?, తన ఆశయం ఏంటో అభిమానులకైనా పవన్ చెప్పాలి? బీజేపీతో పవన్ ఉన్నాడా.. లేడా? అని అంబటి ప్రశ్నించారు. కనీసం అభిమానులకైనా పవన్ ఆశయం ఏమిటో చెబితే బాగుంటుందని అంబటి ఎద్దేవా చేశారు.
తమ ప్రభుత్వం ప్రజలు, రైతులకు జవాబుదారీతనంగా ఉంటుందని పేర్కొన్న అంబటి.. సాధ్యమైనంత త్వరలో పోలవరంను పూర్తి చేస్తామన్నారు. తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, పోలవరంను పూర్తి చేసి తీరుతామని అంబటి అన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు దశల వారీగా పూర్తవుతుంది.సీఎం జగన్ చిత్తశుద్ధితో పాలన చేస్తున్నారు.
దుష్టచతుష్టయం కుట్రలు చేస్తున్నాయి. ప్రభుత్వంపై బురదజల్లాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వంపై 60 శాతం మందికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు తప్పిదాలే కారణం. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంలా చేసుకున్నారని ప్రధాని అన్నారు’ అని అంబటి ఈ సందర్భంగా గుర్తు చేశారు.