
వీరత్వం నుంచి వైరాగ్యం వైపు సేనాని
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ కార్యకర్తలని.. ఫ్యాన్సును రెచ్చగొట్టి నానాయాతన పడి రిలీజ్ చేయించుకున్న హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని విషయాన్ని పవన్ కళ్యాణ్ రెండో రోజు ఒప్పేసుకోవాల్సి వచ్చింది.
సినిమాను సినిమాగా కాకుండా దానికి పొలిటికల్ ఫ్లేవర్ అద్ది.. రాజకీయంగా సైతం లబ్ధి పొందాలని భావించిన పవన్ కళ్యాణ్ వీరమల్లు చిత్రం కోసం తెలుగుదేశం కార్యకర్తలను సైతం వాడుకున్నారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలోని ఎంతోమంది టిడిపి ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఈ సినిమాకు అనుకూలంగా ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు కట్టడం సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టడం జరిగింది.
వాస్తవానికి సినిమా బాగుంటే ఎవరూ పాజిటివ్‌గా ప్రచారం చేయక్కర్లేదు... బాగోలేకపోతే ఎంత ప్రచారం చేసినా జనాలు థియేటర్కు వెళ్ళేది లేదు. ఈ విషయం ఎన్నో మార్లు స్పష్టమైనది. అయినా సరే పవన్ కళ్యాణ్ తనకు తాను ఓ దైవంశ సంభూతుడుగా భావించుకుంటూ మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ జనసేన కుర్రాల్లను రెచ్చగొట్టి మరీ హడావిడి చేశారు.
మొదటి రోజు కేవలం ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు మాత్రం థియేటర్లో గందరగోళం సృష్టించి చెలరేగిపోయారు..తీరా సాయంత్రానికి రకరకాల వెబ్సైట్లు సోషల్ మీడియా చానెళ్లలో రివ్యూలతోబాటు చూసినవాళ్లు చెప్పిన మౌత్ పబ్లిసిటీ దెబ్బకు రెండోరోజుకు అసలు రంగు బయటపడింది.
సినిమా బాలేదు.. నాసిరకంగా ఉంది.. అవాస్తవాలను చరిత్రగా చెప్పడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది అనే టాక్ జనంలోకి వెళ్లిపోయింది. దీంతో ఇక సినిమా ఫ్లాప్ అంట కదా మరి వెళ్లొద్దులే అని జనం వెనుకడుగు వేశారు. మూడో రోజుకు థియేటర్లు మొత్తం ఖాళీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ కు వాస్తవం బాధపడింది. సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి మనసు అంగీకరించక కార్యకర్తలను రెచ్చగొట్టే డైలాగులు చెబుతున్నారు.
సినిమాను నెగిటీవ్‌గా ప్రచారం చేయాలనుకుంటున్న వారికి అక్కడికక్కడే సమాధానం చెప్పండి.. మెతకగా ఉండకండి... వీరత్వం చూపండి రెచ్చిపోండి అంటూ కార్యకర్తలను ఫాన్సను రెచ్చగొడుతున్నారు. ఆ సినిమాను వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది బ్యాన్ చేస్తున్నట్లుగా పోస్టులు పెట్టగా దాని ప్రభావం కూడా ఉందన్న విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి చేరింది. కానీ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా వాళ్లకు క్రెడిట్ ఇవ్వడానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేదాంతం మాట్లాడుతున్నారు.
సినిమా జయాపజయాలు గురించి తాను పట్టించుకోనని చెబుతూ వేదాంతం చెబుతున్నారు. జీవితాలను ఆనందంగా తీసుకోవాలని అన్నారు. బంధాలు..బాంధవ్యాలు ముఖ్యం అని ఏదేదో మాట్లాడుతున్నారు. రిలీజుకు ముందు బిల్డప్పులు కొట్టిన పవన్ రిలీజ్ తరువాత నీరసం వచ్చి వాయిస్‌లో తేడా వచ్చేసింది. తాను పేద కుటుంబములో పుట్టానని.. హీరో అయ్యానని..రాజకీయ పార్టీ పెట్టానని.. గెలుపు ఓటములు తనకు పెద్దగా లెక్కలేదంటూ బాధను అణచుకుని గాంభీర్యం చూపుతున్నారు.
రిలీజ్‌కు ముందు మీసం మెలేసిన పవన్ ఇప్పుడు మొత్తం సాఫ్ అయిపోయి శ్మశాన వైరాగ్యం కబుర్లు చెబుతుండటంతో బాబుకు బాగానే గుణమర్ధన అయిందని జనం భావిస్తున్నారు.
*సిమ్మాదిరప్పన్న