సీఎం చంద్రబాబు సీఎంవోలో బూడిద పంచాయితీలు చేస్తున్నారు
ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా?
కూటమి ప్రభుత్వంలో అన్ని శాఖలు నిర్వీర్యం అయ్యాయి.
బూడిద పంచాయితీలే కాదు ఇసుక, మట్టి, లిక్కర్ ఇలా ప్రతీ చోటా సెటిల్‌మెంట్‌లు, దందాలే.
ప్రజా సమస్యలను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది.
చేతగాని ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుంది
మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు,ఏడు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయకుండా చవట ప్రభుత్వంలా మారిందని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పీ రవీంద్రనాథ్ రెడ్డి. ఈ చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు. సోషల్ మీడియా, వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ప్రభుత్వంలో బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పంచాయితీ చేయాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. సీఎం స్ధాయిలో సీఎంవోలో బూడిద పంచాయితీలు చేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఉంటుందా అని ప్రశ్నించారు.వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీ బూడిదను కూడా కూటమి నాయకులు దోచుకుంటున్నారని, దీని పంచాయితీని సీఎం చంద్రబాబు సెటిల్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఐదారు రోజులుగా బూడిద పంచాయతీ కోసం పోలీసులంతా ఆర్టీపీపీ వద్ద కాపలా కాస్తున్నారని.. వేరే జిల్లా నుంచి దండయాత్రకు వస్తుంటే లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారని ఆరోపించారు. స్థానిక నాయకులను కూడా అదుపు చేయలేకపోతున్నారని అన్నారు.
ఇదే కాదు మట్టి, ఇసుక, లిక్కర్ ఇలా ప్రతీది దోచుకోవడమే, దోచుకోవడంలో పోటీ లేకుండా ఉండేందుకు సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారు, జిల్లాలోని పోలీస్ యంత్రాంగం అంతా బూడిద కాపలాకు వినియోగిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఇలా వీటిపై దృష్టిపెట్టడం ఎంతవరకు సమంజసం?. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒక్క పనీ జరగడం లేదు. ఇంత దారుణమైన పాలన ఉంటుందని ఏ ఒక్కరూ అనుకుని ఉండరు. పాలన మొత్తం నిర్వీర్యమైంది. అసలు రాష్ట్రంలో పాలన వ్యవస్థ అనేది ఉందా.
రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విత్తనాలు, ఎరువులు లేక అవస్ధలు పడుతున్నారు. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని అంతా దిగువకు వదిలేస్తున్నారు. 215 టీఎంసీలకు గాను శ్రీశైలంలో 124 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. రబీకి అవసరమైన నీటిని నిల్వ చేస్తున్నారా అంటే అదీ లేదు. రిజర్వాయర్‌లు ఖాళీ అవుతున్నాయి.
కేఆర్‌ఎంబీ వారు గుర్తించి చెబితే కానీ ఏపీ ప్రభుత్వానికి చలనం లేదు. ఏపీ ప్రభుత్వానికి దున్నపోతు మీద వానకురిసిన చందంగా మారింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగుతోంది. దీనిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుంది, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇది చేతగాని ప్రభుత్వంగా మారింది, ప్రజలే బుద్దిచెప్పే రోజు త్వరలో వస్తుంది’ అని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment