బీఆర్‌ఎస్‌లోకి గాయకుడు ఏపూరి సోమన్న

Noted folk singer: YSRTP leader Epuri Somanna join BRS Party - Sakshi

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్‌తో భేటీ

ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో చేరిక

సాయిచంద్‌ లేనిలోటును పూడ్చేందుకేనన్న బీఆర్‌ఎస్‌ వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యమ గాయకుడు, వైఎస్సార్‌టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రగతిభవన్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలిశారు. ఉద్యమంలో కలసి పనిచేసిన రీతిలోనే బీఆర్‌ఎస్‌ వెంట నిలిచేందుకు సోమన్న సుముఖత వ్యక్తం చేయగా.. కేటీఆర్‌ స్వాగతించారు.

ఈ భేటీలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో సోమన్న గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. కేటీఆర్‌ తనను పార్టీలోకి స్వాగతించారని, కుటుంబ సభ్యుడిలా చూసుకుంటామని హామీ ఇచ్చారని ఏపూరి సోమన్న ‘సాక్షి’కి వెల్లడించారు.

పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇస్తామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ఉద్యమంలో భాగమైన తరహాలోనే అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.

సాయిచంద్‌ లేని లోటు పూడ్చేందుకే?
బీఆర్‌ఎస్‌ సాంస్కృతిక విభాగానికి వెన్నెముకగా పనిచేసిన కవి, గాయకుడు సాయిచంద్‌ ఈ ఏడాది జూన్‌లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ సభలు, సమావేశాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలను సాయిచంద్‌ ముందుండి నడిపించేవారు. ఆయన లేని లోటును పూడ్చేందుకు.. జనాలను ఆకట్టుకునే శక్తి ఉన్నందుకే సోమన్నను చేర్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ మొగ్గు చూపినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రచార సభల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు సోమన్న నేతృత్వం వహించే అవకాశం ఉందని అంటున్నాయి.

బీఆర్‌ఎస్‌లోకి బీజేపీ హైదరాబాద్‌ నేతలు
బీజేపీ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడిగా, కార్పొ రేటర్‌గా పనిచేసిన వెంకట్‌రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్‌ పద్మ శుక్రవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్‌ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబర్‌పేటలో కాలేరు వెంకటేశ్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top