బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ | New National Executive Committee for BJP | Sakshi
Sakshi News home page

బీజేపీకి కొత్త జాతీయ కార్యనిర్వాహక కమిటీ

Oct 8 2021 3:43 AM | Updated on Oct 8 2021 3:35 PM

New National Executive Committee for BJP - Sakshi

రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని గురువారం ప్రకటించింది.

సాక్షి , న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ అందుకనుగుణంగా పార్టీ కొత్త జాతీయ కార్య నిర్వాహక కమిటీని గురువారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, గోయల్, అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి సహా 80 మంది సభ్యులు ఉన్నారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన అశ్విని వైష్ణవ్, మన్సుఖ్‌ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా, మీనాక్షి లేఖిలను కమిటీలోకి తీసుకున్నారు. లఖీమ్‌పూర్‌ ఘటనలో రైతులకు న్యాయం జరగాలని, కారకులకు శిక్ష పడాలంటూ సంబంధిత వీడియోను ట్వీట్‌చేసిన పార్టీ ఎంపీ వరుణ్‌ గాంధీకి కొత్త కమిటీలో చోటు దక్కలేదు.

మోదీ సర్కార్‌ విధానాలపై విమర్శలు చేసిన మాజీ కేంద్రమంత్రి బీరేందర్‌ సింగ్‌తోపాటు వ్యవసాయ చట్టాల్లో రైతు అనుకూల వ్యాఖ్యలు చేసిన ఎంపీ మేనకాగాంధీని కమిటీ నుంచి తప్పించారు. కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కన్నా లక్ష్మీనారాయణకు చోటు కల్పించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకట్‌స్వామి, గరికపాటి మోహన్‌రావులకు స్థానం లభించింది.

ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి ఈటల రాజేందర్, విజయశాంతిలకు అవకాశం కల్పించారు. కమిటీలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 35 మంది పార్టీ పదాధికారులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులకూ చోటు కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ సీఎంలు, జాతీయ మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement