
నాడు వద్దన్న హిందీ నేడు ముద్దైంది
ఊసరవెల్లికి కోచింగ్ ఇచ్చే స్థాయికి సేనాని
రామాయణాన్ని వాల్మీకి రాశారు.. వేద వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కవిత్రయం అనువదించింది. మను చరిత్రను అల్లసాని పెద్దన రాశారు. జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.. వందేమాతరం గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు.. అవన్నీ అందరికీ తెలుసు కానీ పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు చెప్పండి.. షాక్ అయ్యారా.. లేదు మళ్ళీ చదవండి.. పెద్దమ్మ భాషను ఎవరు కనిపెట్టారు?.
అదేంది మాతృభాషను అమ్మ భాష అంటారు అది అందరికీ తెలిసిందే. కానీ ఈ పెద్దమ్మ భాష ఏంది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా.. ఈరోజే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనిపెట్టారు.. ఆయన ఎవరితో పొత్తులో ఉంటే ఆ పాట పాడుతారు ఆ గుమ్మం ముందు ఆ ఆట ఆడతారు. ఆయన ఎవరికి తాబేదారుగా ఉంటే ఆ పార్టీ భజన గీతాలు నేరుస్తారు. గతంలో నన్ను మా అమ్మను ఎన్ని రకాలుగా అవమానించారు అంటూ తెలుగుదేశం మీద చిందులు తొక్కిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా ఇంకో 20 ఏళ్లు చంద్రబాబుకు పాలేరుగా ఉండడానికి సిద్ధం అని ప్రకటించారు.
పాచిపోయిన లడ్లు ఇచ్చిన బీజేపీకి మనం తలవంచుతామా అంటూ అటూ ఇటూ తల ఎగరేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ గుమ్మం ముందు బిస్కెట్లు ఏరుకుంటున్నారు. ఈ ఢిల్లీ వాళ్లకి అహంకారం ఎక్కువ సౌత్ ఇండియా వాళ్ళు అంటేనే వాళ్లకు లెక్కలేదు.. అలాంటి వారితో మనకు పొత్తా.. చెప్పండి చెప్పండి అంటూ ఊగిపోయిన పవన్ మళ్ళీ బీజేపీ పంచన చేరారు. ఉత్తర భారతదేశ పార్టీలు నాయకులకు దక్షిణ భారతదేశం అంటే చిన్న చూపు.. వాళ్లు తమ భాషను నాగరికతను సంస్కృతిని మనపై రుద్దుతున్నారు అంటూ చిందులు తొక్కిన పవన్ తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి ఆయన సరికొత్త భాష్యం చెబుతున్నారు. మాతృభాష తల్లి అయితే హిందీ పెద్దమ్మ భాష అంటూ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
మరోవైపు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో హిందీ అంటేనే ఒప్పుకోవడం లేదు. తమిళులకు తమ మాతృభాషపై ఎనలేని మక్కువ ఉంది హిందీ మేము ఎందుకు నేర్చుకోవాలి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద చర్చ లేవదీశారు. తమిళులు సాధ్యమైనంత వరకు పార్లమెంట్లో కూడా తమిళంలోనే మాట్లాడతారు. కేరళలో కూడా హిందీ అంటే వ్యతిరేకత ఉంది. కర్ణాటకలో ప్రజలు కన్నడం అంటే ప్రాణం పెడతారు. ఆంధ్రాలో కూడా హిందీకి ప్రాధాన్యం తక్కువే. కానీ పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఆయనకు హిందీ పట్ల ప్రేమ పెరిగిందో తన రాజకీయ అవసరాల కోసం ఇలా నటిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ. దీని పెద్దమ్మ భాష అంటూ నెత్తికెత్తుకున్నారు.
వాస్తవానికి ఆయన సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని మోస్తూ ఆ ఎపిసోడ్ గడిపేస్తూ ఉంటారు. ఆమధ్య కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం చేస్తున్న నౌకను చూసి సీజ్ ది షిప్ అన్నారు. ఆ తరువాత ఆ అంశాన్ని వదిలేశారు. ఇప్పుడు యథావిధిగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతోంది. తిరుమల ప్రసాదంలో కొవ్వుంది అన్నారు.. నాల్రోజులు కాషాయం బట్టలు వేసుకుని హడావుడి చేశారు.. దాన్ని వదిలేశారు. వారాహి డిక్లరేషన్.. సనాతన ధర్మం అన్నారు.. దాన్ని పక్కనబెట్టారు. ఇప్పుడు తాజాగా హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని అంటున్నారు.. మరి ఈ అంశాన్ని ఎప్పుడు వదిలేస్తారో చూడాలి.. సీజన్లను బట్టి ప్రాధాన్యాలు మార్చుకునే పవన్ కళ్యాణ్ ఊసరవెల్లికి సైతం కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు అని ప్రజలు విస్తుపోతున్నారు.
-సిమ్మాదిరప్పన్న.