
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆఫీస్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ శ్రేణలు అడ్డుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతల ప్రెస్‌మీట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో అసహనంగా ఉన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్ కార్యాలయంపైకి మహిళలను పంపించారు. పోలీసులు రావడంతో ప్రశాంతిరెడ్డి అనుచరులు పారిపోయారు.
కూటమిలో కలవరం
నిన్న(గురువారం) వైఎస్ జగన్ రాకతో సింహపురి జన ఝరిగా మారిన సంగతి తెలిసిందే. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు పుట్టించింది.
జననేత పర్యటనను అడ్డుకునేందుకు ఊరూరా ఆంక్షలు విధించినా.. పెద్ద సంఖ్యలో చెక్‌పోస్ట్‌లు.. అడుగడుగునా బారికేడ్లు.. ముళ్ల, ఇనుప కంచెలను నెలకొల్పినా.. రహదారులను ధ్వంసం చేసినా, ఇవేవీ పార్టీ అభిమానులను అడ్డుకోలేకపోయాయి. వారిని నిర్బంధించలేకపోయాయి. పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకు అనేక అడ్డంకులు సృష్టించినా.. ఖాకీలు లాఠీలను ఝళిపించినా.. ఊహించని స్థాయిలో పోటెత్తారు.
