నల్గొండపై బీజేపీ పట్టు? | Sakshi
Sakshi News home page

నల్గొండపై బీజేపీ పట్టు?

Published Mon, Jan 15 2024 11:40 AM

Nalgonda BJP Strategy In Upcoming Lok Sabha Election - Sakshi

నల్గొండ: అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి ఆశించిన ఫలితాలైతే రాలేదు. లోక్ సభ ఎన్నికల్లో ఉనికి చాటుకుంటామని చెబుతోంది. మరి కారు, హస్తం పార్టీలకు ధీటైన అభ్యర్థులను బరిలో దించుతుందా ? లేదంటే పేరుకు మాత్రమే పోటీలో ఉంటుందా? అసలు జిల్లాలో కాషాయ పార్టీ పరిస్థితి ఏంటి? ఎంపీ సీట్లకు పోటీ చేయడానికి తగిన అభ్యర్థులున్నారా? పోటీకి సిద్ధమవుతున్న నేతలెవరు?

కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని పార్టీలు బరిలో దిగుతామంటున్న నేతల వడపోత పనిలో పడ్డాయి. అభ్యర్థుల వేటలో పడిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తోడు బీజేపీ కూడా నల్లగొండ జిల్లాలో ఉన్న రెండు స్థానాల్లో పట్టు సాధించాలనుకుంటోంది‌. అసెంబ్లీ ఎన్నికల్లో సంగతి ఎలా ఉన్నా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి నల్గొండ, భువనగిరి స్థానాల్లో గణనీయంగానే ఓట్లు పోలవుతున్నాయి. ఇంతవరకు ఈ రెండు స్థానాల్లో ఆ పార్టీ ఖాతా అయితే తెరవలేదు. భువనగిరిలో కాషాయ పార్టీకి చెప్పుకోదగ్గ కేడర్ ఉంది. కానీ ఓట్ల రూపంలో మల్చుకునే సరైన నాయకుడు లేకపోవడంతో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలా అయినా ఈరెండు పార్లమెంట్‌ స్థానాల్లో పట్టు సాధించాలని కాషాయ పార్టీ కంకణం కట్టుకుందట. సరైన అభ్యర్థులను ఎంపిక చేసి బరిలో నిలవాలని ప్లాన్ చేస్తోందని టాక్.  

పోటీలో సీనియర్లు..
నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల నర్సింహ్మారెడ్డిని బరిలో దించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందట. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు నర్సింహ్మారెడ్డికి జిల్లావ్యాప్తంగా ఉన్న పరిచయాలు కూడా కలిసి వస్తాయని పార్టీ లెక్కలు వేస్తోందట. అయితే నూకల మాత్రం పోటీకి అయిష్టంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు వైద్యుడిగా కొనసాగుతున్న నాగం వర్షిత్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలను కోరుతున్నారని సమాచారం. అసెంబ్లీ సీటు రాకపోయినా పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకున్నానని ఆయన గుర్తు చేస్తున్నారట. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు ఫౌండేషన్ పేరుతో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో గుర్తింపు పొందినట్లు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి చెబుతున్నారు. గోలి మధుసూదన్ రెడ్డి లాంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు కూడా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వమని అడుగుతున్నారట.

ఓడిన చోటే గెలవాలని..
ఇక భువనగిరిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారని టాక్. 2014లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బూర.. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొంతకాలం క్రితం ఆయన కాషాయ తీర్థం తీసుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టీవ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోయిన దగ్గరే పరువు నిలబెట్టుకోవాలని ఆయన అనుకుంటున్నారట. బీజేపీ నాయకత్వం కూడా బూర నర్సయ్యగౌడ్‌ అభ్యర్థిత్వం పట్ల సానుకూలంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది‌. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేశానని, మరోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తానని అంటున్నారట. వీరితో పాటు కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న పడమటి జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం కోసం పట్టుబడుతున్నారట.

త్యాగం చేశానంటున్న గంగిడి..
ఇక బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న గొంగిడి మనోహర్ రెడ్డి ఇటు నల్లగొండ నుంచైనా అటు భువనగిరి నుంచైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసి మరొకరికి అవకాశం ఇచ్చానని.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఏదో ఒకచోట అవకాశం కల్పించాలని కోరుతున్నారట. ఇదిలా ఉంటే నల్లగొండ సెగ్మెంట్ లో ఇద్దరు బీఆర్ఎస్, ఒక కాంగ్రెస్ నేత టికెట్ ఇస్తే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట.‌ ఇదే విషయాన్ని ఇటీవల ఓ బీజేపీ సీనియర్ నేతతో నల్లగొండలోని ఓ హోటల్ లో జరిగిన రహస్య సమావేశం సందర్భంలో తమ మనసులో మాటను బయటపెట్టారట. అందుకు ఆ నేత రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారట. ఇక భువనగిరిలో మరో ఎన్నారై కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా జిల్లాలోని రెండు స్థానాల్లో ఉనికి చాటుకునేందుకు ఈసారి బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఆశావాహులు కూడా అదేస్థాయిలో లాబియింగ్ ప్రారంభించారు‌. చూడాలి మరి‌ టికెట్లు ఎవరికి ఇస్తారో..? ఫలితాలు ఎలా ఉంటాయో..‌?

ఇదీ చదవండి: సందిగ్ధంలో ఎన్నికలు

Advertisement

తప్పక చదవండి

Advertisement