బాబు అవకాశవాద రాజకీయాలు ఇక చెల్లవు  | Sakshi
Sakshi News home page

బాబు అవకాశవాద రాజకీయాలు ఇక చెల్లవు 

Published Thu, Apr 18 2024 4:25 AM

Muslim JAC convener Muneer Ahmed with sakshi - Sakshi

మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకొని మాయమాటలు చెబుతున్నాడు 

చంద్రబాబు జిమ్మిక్కుల్ని ముస్లిం సమాజం నమ్మదు 

సాక్షితో ముస్లిం జేఏసీ కన్వీనర్‌ మునీర్‌ అహ్మద్‌  

సాక్షి, అమరావతి:  చంద్రబాబు మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకుని మాయమాటలు చెబుతున్నాడని, ఆయన అవకాశవాద రాజకీయాలు ఇక చెల్లవని ముస్లిం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) రాష్ట్ర కన్వినర్‌ షేక్‌ మునీర్‌ అహ్మద్‌ చెప్పారు. చంద్రబాబు తీరును తప్పుబడుతూ మునీర్‌ అహ్మద్‌ మంగళవారం సాక్షితో మాట్లాడారు. సొంత అవసరం, అవకాశాన్ని బట్టి పార్టీలతో పొత్తులు పెట్టుకునే చంద్రబాబు ముస్లిం మైనార్టీలను మాయమాటలతో మోసం చేస్తూ వచ్చారన్నారు. ప్రతిసారి బీజేపీతో పొత్తుపెట్టుకోవడం, ఇంకెప్పుడూ మళ్లీ బీజేపీతో పొత్తుపెట్టుకోనని నమ్మబలకడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు.

మళ్లీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని సిగ్గులేకుండా జనం ముందుకు వస్తున్నాడన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం నైతిక విలువలు లేని స్వార్థ రాజకీయ చరిత్రేనని చెప్పారు. ఈ అనైతిక పొత్తును ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీలో విలీనం కావడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు తొలినుంచి ముస్లిం ఓట్లు రాబట్టుకుని వారిని ధోకా (మోసం) చేయడం అలవాటుగా మారిందన్నారు. బీజేపీతో జట్టుకట్టిన చంద్రబాబు వివక్షపూరిత స్వభావం కలిగిన సీఏఏ బిల్లుకు మద్దతు తెలపడం స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని చెప్పారు.

మైనారిటీలకు పదవులు ఇవ్వలేదని ప్రశ్నించిన ముస్లిం సోదరులపై చంద్రబాబు దేశద్రోహం కేసులు పెట్టించిన దురాగతాలను ముస్లిం సమాజం మరచిపోలేదన్నారు. చంద్రబాబు ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం ముస్లింల కోసం రూ.3,495 కోట్లు కేటాయిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.23 వేల కోట్లు ముస్లిం సంక్షేమానికి ఖర్చు చేసిందని చెప్పారు.

ముస్లింలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన నాలుగుశాతం రిజర్వేషన్లను కొనసాగిస్తున్న సీఎం జగన్‌ ముస్లిం మైనార్టీలకు ఇళ్లస్థలాలు, ఇళ్లు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వివరించారు. ముస్లింలకు ఇచ్చిన నాలుగుశాతం రిజర్వేషన్లు తొలగిస్తామని చెబుతున్న బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ముస్లింలను దగాచేయడానికి జట్టుకట్టారని మండిపడ్డారు.

ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌తోపాటు అనేక రాజకీయ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన సీఎం జగన్‌ ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయించి అండగా నిలిచారని గుర్తుచేశారు. ముస్లింలలో వ్యతిరేకతను గమనించిన చంద్రబాబు కొందర్ని చుట్టూ పెట్టుకుని మళ్లీ మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. గత అనుభావాలను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సమాజం చంద్రబాబు జిమ్మిక్కులను నమ్మేస్థితిలో లేదని, సీఎం జగన్‌కే ముస్లింల మద్దతు దక్కుతుందని మునీర్‌ అహ్మద్‌ స్పష్టం చేశారు.   

Advertisement
 
Advertisement