‘ఆంధ్రజ్యోతి’పై పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఆగ్రహం

MP Pilli Subhash Chandra Bose Slams Yellow Media Over Rumours - Sakshi

ఆంధ్రజ్యోతి అసత్య కథనాలపై వైఎస్సార్‌ సీపీ ఎంపీల ఆగ్రహం

రాష్ట్ర సమస్యల గురించి సీఎం జగన్‌ అమిత్‌ షాతో చర్చించారు

ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు

 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంపై ఆంధ్రజ్యోతి అవాస్తవ కథనాలు రాస్తోందని వైఎస్సార్‌ సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం జగన్‌ అమిత్ షాతో చర్చించారని, ఈ భేటీ సానుకూలంగా జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, ఏపీ విభజన జట్టంలోని అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని పేర్కొన్నారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం వాస్తవాలను వక్రీకరించి, అసత్యాలు ప్రచారం చేస్తోందని, ఇలాంటి రాతల వల్ల పత్రిక ప్రజల్లో పలుచన కావడం ఖాయమని చురకలు అంటించారు. (చదవండి: అమిత్ షాతో రెండోసారి సీఎం జగన్ భేటీ )

ఇక అమరావతి భూ కుంభకోణం విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల గురించి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. జడ్జీల ప్రవర్తనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సర్వోన్నత న్యాయస్థానంపై ఉందన్నారు. ఈ పరిణామాలపై ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా అర్థంకావడం లేదని వాపోయారు.

అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు: మోపిదేవి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల భేటీపై అబద్ధాలు ప్రచారం చేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ వికృతంగా ప్రవర్తిస్తోందని వైఎస్సార్‌ సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరి ఢిల్లీకి వచ్చారన్నారు. అమరావతి భూ కుంభకోణం, జడ్జీల వ్యవహారం, ఫైబర్ నెట్‌వర్క్‌ తదితర అంశాలను ప్రస్తావించారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను ఆయన వివరించారన్నారు.

ఇందుకు అమిత్‌ షా సానుకూలంగా స్పందించారని తెలిపారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం అసత్య కథనాలు ప్రసారం చేస్తూ రాక్షసానందం పొందుతోందని మండిపడ్డారు. ఇందుకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని మోపిదేవి వెంకటరమణ చురకలు అంటించారు.  ఇక మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన సాగిందన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను సాధించుకునే దిశగా ముందుకెళుతున్నారని హర్షం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top