
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రభుత్వానికి, నిరుద్యోగులకు మధ్య వారధిగా తాను పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాదులోని గన్ పార్క్‌లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్థూపానికి మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం, గన్‌పార్క్ దగ్గర రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నిరుద్యోగులు అధైర్య పడకండి నిరసనలు ధర్నాలు మానుకోండి మీ సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తా, సెంట్రల్ లైబ్రరీకి, దిల్‌సుఖ్‌నగర్‌కి నేనే వస్తాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిది. పదేళ్లలో నిరుద్యోగుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక గ్రూప్ వన్ కూడా వేయలేకపోయారు. బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు
తెలంగాణ యువత కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైనది. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. అనుకున్న స్థాయితో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. నిరుద్యోగులకు అండగా ఉంటా అధైర్య పడకండి. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల ప్రభుత్వం ఇది. ప్రజల ప్రభుత్వం సెప్టెంబర్ 17ను కూడా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సోనియాగాంధీ కలలు కన్న తెలంగాణ రాష్ట్రం పదేళ్ల కాలంలో సాకారం కాలేదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి
ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయినా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్న యువత తమ కాళ్ల మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తాం. మీకు న్యాయం జరిగే వరకూ మీ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తాను. నిరుద్యోగులకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చా.. నిరుద్యోగులు అధైర్య పడకండి. నిరసనలు, నిర్బంధాలు ధర్నాలు అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు.
