
2014–19 మధ్య పరిస్థితిని అంగీకరించిన మంత్రి నారాయణ
వరల్డ్ బ్యాంకు, ఏడీబీ రుణంతో అమరావతి నిర్మాణం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణ పనులు 2014–19 మధ్య కాలంలో 10 శాతం కూడా పూర్తి కాలేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అంగీకరించారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. దీంతో, పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ బదులిస్తూ.. ‘2014–19లో 10 శాతం కంటే తక్కువ పనులు జరిగాయి. ఇంకా 90 శాతం పనులు ఉన్నాయి. కాబట్టే.. పాత రేట్లకు కాంట్రాక్టర్లు టెండర్లు కొనసాగించలేమన్నారు. అందుకే వాటిని రద్దు చేశాం. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం ఉండాలనే టెండర్లలో నిబంధనలు రూపొందించి కొత్తగా పెరిగిన రేట్లకు కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చాం’ అని తెలిపారు. ప్రస్తుతం అమరావతి క్యాపిటల్ సిటీలో సీఆర్‌డీఏ 21 పనులు, ఏడీసీఎల్ 64 పనులు చేపట్టిందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల పునాదుల్లో నీళ్లు ఉండిపోయాయని, నీళ్లు తొలగించాక పునాదుల పటిష్టతను పరిశీలిస్తామన్నారు.
రూ.50 వేల కోట్ల కాంట్రాక్టులు నవరత్నాలకేనా!
అమరావతిలో రూ.50 వేల కోట్లతో 84 పనులకు కాంట్రాక్టుల నవరత్నాల మాదిరిగా కేవలం 9 సంస్థలకే ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలో 3 వేల మంది కాంట్రాక్టర్లు బిల్లులు రాక నలిగిపోతున్నారన్నారు. అమరావతి పనుల్లో కనీసం సబ్ కాంట్రాక్టులు అయినా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సీఆర్‌డీఏ, ఏడీసీఏల్ కాంట్రాక్టర్లు పనులు చేసి బిల్లుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, వారు గతంలో చేసిన పాత పనులను రద్దుచేసి ప్రభుత్వం కొత్తవారికి కొత్త రేట్లకు టెండర్లు ఇచ్చారన్నారు. నవరత్నాలకు ఎల్1 దర్శనమా? మిగిలిన వాళ్లకు జనరల్ దర్శనమా అని నిలదీశారు. ఆర్థిక శాఖ వింత పోకడలతో కొత్త వెబ్సైట్లు తీసుకురావడంతో పాత బిల్లులు మైగ్రేట్ అవ్వలేదన్నారు.