నల్లగొండను నాశనం చేసిందే నువ్వు

Minister Komati Reddy fire on KCR - Sakshi

కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ధ్వజం

పదేళ్లు ప్రాజెక్టులను పడావు పెట్టారు

పార్లమెంటు ఎన్నికల కోసమే ఈ నాటకాలు

సాక్షి, హైదరాబాద్‌:     నల్లగొండ జిల్లాను నాశనం చేసిందే కేసీఆర్‌ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘పదేళ్ల పాటు జిల్లాలోని ప్రాజెక్టులను పడావు పెట్టారు. కనీసం జిల్లా ప్రజల వైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు తన ఏజెంట్లతో కృష్ణా ప్రాజెక్టుల వివాదాన్ని రగిలించి ఆ మంటల్లో చలి కాచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు..’ అని ఆరోపించారు.

నల్లగొండ సభలో మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఒక ప్రకటనలో వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల కోసమే కేసీఆర్‌ నాటకాలని, నాలుగు రోజుల్లో తన ఇంటికి కలవడానికి వచ్చేంత జనమే కేసీఆర్‌ మీటింగ్‌కు వచ్చి ఉంటారని ఎద్దేవా చేశారు.

పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడేటప్పుడు పరిణతితో మాట్లాడాలన్న విజ్ఞతను మరిచి కల్లు కాంపౌండ్‌ దగ్గర తాగుబోతు కంటే అ ధ్వాన్నంగా మాట్లాడు తున్నాడని విమర్శించా రు. పిచ్చికూతలు కూ స్తే చూస్తూ ఊరుకునేది లేదని, దెబ్బకు దెబ్బ ను ప్రజాస్వామ్య యు తంగా కొట్టి తీరతా మని హెచ్చరించారు. 

నల్లగొండ ప్రజల రక్తంలోనే ఉద్యమం
‘నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి త్యాగంతో తెలంగాణ వచ్చింది. శ్రీకాంతాచారి తల్లికి పదవి ఇస్తానని చెప్పి పదేళ్లు అవమానించాడు. నల్లగొండ సభలో ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి ఫోటో కూడా లేకుండా తన ఒక్కడి ఫోటో మాత్రమే పెట్టుకుని నియంతలా వ్యవహరించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ చరిత్ర ప్రజల ముందు పెట్టి ఆయన అహంకారానికి కళ్లెం వేస్తాం.

నల్లగొండ ప్రజల రక్తంలోనే ఉద్య మం ఉంది. నియంతృత్వ భావ జాలాన్ని, నియంతలను ఇక్కడి ప్రజలు దగ్గరకు రానీయరు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని శపథం చేసిన సీమాంధ్ర సానుభూతిపరుడు కేసీఆర్‌. ఇప్పుడు అధికారం పోగానే గజనీలా గతం మర్చిపో యాడు. ఆయన అక్కడకే వెళ్లి ఆంధ్ర రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టుకోవడం మంచిది. 

అసెంబ్లీని వదిలి నల్లగొండకు  ఎందుకు?
నేను రైతుబంధు రాలేదన్న బీఆర్‌ఎస్‌ నేతలను చెప్పుతో కొట్టాలంటే, ప్రజలను అన్నట్టుగా ఆపాదించారు. ఇది కేసీఆర్‌ కుటిల బుద్ధికి నిదర్శనం. నిజంగా కేసీఆర్‌కు చిత్తశుద్ధి, ప్రజలపై ప్రేమ ఉంటే ఐదు నిమిషాల్లో చేరుకునే అసెంబ్లీని వదిలిపెట్టి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లగొండకు ఎందుకు వచ్చారు? ఆయన కుమారుడి అనుంగు అనుచరుడైన ఓ అధికారిని విచారిస్తే వేల కోట్ల ఆస్తులు దొరుకుతుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. మెదక్‌లో కేసీఆర్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపిస్తాం. దమ్ముంటే కేసీఆర్‌ గెలవాలి.’ అని కోమటిరెడ్డి సవాల్‌ చేశారు.  

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top