రేవంత్ హైబ్రిడ్ ఫార్ములా.. ఎంఐఎం ప్లాన్‌: కిషన్‌ రెడ్డి | Minister Kishan Reddy Serious Comments On BRS And Congress MIM | Sakshi
Sakshi News home page

రేవంత్ హైబ్రిడ్ ఫార్ములా.. ఎంఐఎం ప్లాన్‌: కిషన్‌ రెడ్డి

Apr 17 2026 10:30 AM | Updated on Apr 17 2026 10:40 AM

Minister Kishan Reddy Serious Comments On BRS And Congress MIM

సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్‌పై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై తెలంగాణ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. మహిళల రిజర్వేషన్లకు మజ్లిస్‌ వ్యతిరేకం అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా.. అసదుద్దీన్ చెప్పినది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. నార్త్‌, సౌత్‌ మధ్య యుద్ధం వస్తుందని మాట్లాడుతున్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తామని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు. రెవెన్యూ ఎక్కువగా వస్తుందని హైదరాబాద్‌లోనే రేవంత్ అసెంబ్లీ సీట్లు పెంచుతారా?. డబ్బు ఎక్కువగా ఉన్న వారికి ఎక్కువ ఓటు విలువ ఇస్తారా? అని ప్రశ్నించారు.

మహిళల రిజర్వేషన్లకు మజ్లిస్‌ వ్యతిరేకం. హైదరాబాద్‌లో తమ సీట్లు పోతాయని మజ్లిస్‌ భయం. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు కుమ్మకై తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన ఫార్ములాను రేవంత్‌ రెడ్డి ద్వారా అసదుద్దీన్‌ చెప్పించారు. నియోజకవర్గాలు పెరిగితే మహిళలు, యువతకు  కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త నాయకత్వం వస్తే తమ పీఠాలు కదులుతాయని మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు అడ్డుకుంటున్నారు. ఎంఐఎం మహిళలకు వ్యతిరేక రాజకీయాలు చేస్తోంది. మహిళా రిజర్వేషన్‌కు అడ్డుపడాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం కలిపింది. మహిళలను అనగదొక్కే పార్టీ మజ్లిస్ పార్టీ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రతీ రాజకీయ పార్టీ ప్రధాని మోదీ ఫొటోను వాళ్ల ఆఫీసుల్లో పెట్టుకోవాలి. ఏపీలో లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. తమిళనాడులో లోక్‌సభ సీట్లు 39 నుంచి 59కి పెరుగుతున్నాయి. సౌత్‌లో పెరిగినట్టుగానే నార్త్‌లో కూడా లోక్‌సభ సీట్లు పెరుగుతాయి. దేశమంతా ఒకే నిష్పత్తిలో సీట్లు పెరుగుతున్నప్పుడు వచ్చిన నష్టమేంటి?. సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని అడ్డుకోవాలి. గెజిట్‌ నోటిఫై కాకుండా రాజ్యాంగ సవరణ చేయలేం. అన్ని పార్టీలతో మాట్లాడినప్పుడు ఒప్పుకుని పార్లమెంట్‌కు వచ్చాక అడ్డుకోవడమేంటి? అని ప్రశ్నించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement