CM Jagan: లండన్‌లో సీఎం జగన్‌ ల్యాండింగ్‌పై మంత్రి బుగ్గన క్లారిటీ

Minister Buggana Rajendranath Gives Clarity On CM Jagan Landing On London - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారిందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందన్నారు. కనీస విలువలను పాటించాలన్న స్పృహకోల్పోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనపై యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయని, వయసు మీద పడుతున్న కొద్దీ.. యనమల కనీస సంస్కారం కూడా లేకుండా రోజురోజుకూడా దిగజారిపోతున్నారని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు

‘గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమాన ప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం, దీనిమీద పనిగట్టుకుని సీఎం జగన్‌ మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేయడం యనమల లాంటి వారు, ఎల్లోమీడియా ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం అవుతుంది.  దాపరికంతో, దొంగదారుల్లో అధికారం సాధించడం, ప్రజలను వంచించడం అన్నది టీడీపీ ట్రేడ్‌ మార్క్‌ తప్ప మాది కాదు. 

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన రహస్యమేమీ కాదు. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్‌ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగింది. దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది.
చదవండి: దావోస్‌ చేరుకున్న సీఎం జగన్‌

లండన్‌లో కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉంది. ఈలోగా జురెక్‌లో ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది. మళ్లీ ల్యాండింగ్‌కోసం అధికారులు రిక్వెస్ట్‌పెట్టారు. ఈప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారు. రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాలు ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాల నుంచి నిషేధించిన విషయాన్ని స్విస్‌ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారు. 

ఈ విషయాలన్నీకూడా స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు, లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారు. వారు నేరుగా ముఖ్యమంత్రితో కూడిన అధికారులతో చర్చించి.. లండన్‌లోనే వైఎస్‌ జగన్‌కు బస ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామునే జురెక్‌ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ.. పైలట్లు నిన్న అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది.  

నిజాలు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రిమీద అసూయతో, ద్వేషంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా ప్రతిరోజూ ఆయన మీద బురదజల్లడం, ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. దిగజారిపోవడంలో మరో మైలు రాయిని టీడీపీ అందుకుంది’ అని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
చదవండి: Anantapur: చంద్రబాబు సభలో ‘పరిటాల’ అనుచరులు రచ్చరచ్చ.. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top