మీ జాతకాలన్నీ నా దగ్గరున్నాయి.. ‘పరిటాల’ అనుచరులకు చంద్రబాబు హెచ్చరిక

Conflicts Between TDP Leaders In Chandrababu Anantapur Tour - Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌/కనగానపల్లి/రాప్తాడు:  టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో ఆ పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు సభలో మరో నేతకు మాట్లాడేందుకు అవకాశమివ్వలేదు. పార్టీలో క్రమశిక్షణ తప్పిందని అంగీకరిస్తూనే.. సరిదిద్దేందుకు కఠినంగా వ్యవహరిస్తానని అన్నారు.  తనను కలిసేందుకు ఎవరు వచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండబోదని తేల్చి చెప్పారు. సభ మధ్యలో కార్యకర్తలు చీటీలు రాసి నేతలపై ఫిర్యాదులు పంపారు. వాటిని చూసిన చంద్రబాబు తనకు అన్నీ తెలుసునన్నారు.
చదవండి: చీప్‌ పాలి‘ట్రిక్స్‌’కు తెరలేపిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

కాగా, సభావేదిక ఏర్పాటు సక్రమంగా లేకపోవడంతో చంద్రబాబు ప్రసంగాన్ని కవర్‌ చేసేందుకు మీడియా ఇబ్బంది పడింది. ఈ క్రమంలోనే తమ అధినేత కనిపించడం లేదంటూ కార్యక్రమాన్ని కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళా కార్యకర్త ఏకంగా దూషణలకు దిగింది. కాగా, చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తూ నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కొందరి నేతల ఫొటోలను ఆ పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గాలు తొలగించడం వివాదాస్పదమైంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఫ్లెక్సీని సగానికి పైగా కత్తిరించేశారు.  

మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయి.. జాగ్రత్త! 
‘ఏయ్‌.. ఏం కావాలి. ఎందుకు గొడవ చేస్తున్నారు.. మాట్లాడొద్దు.. మీ జాతకలన్నీ నా దగ్గరున్నాయి. జాగ్రత్త’ అంటూ పరిటాల శ్రీరామ్‌ అనుచరులను చంద్రబాబు హెచ్చరించారు. రాప్తాడులో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగాన్ని పలువురు అడ్డుకుని పరిటాల శ్రీరామ్‌కు మాట్లాడేందుకు అవకాశమివ్వాలని నినాదాలు చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీతను వేదికపైకి పిలవకపోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం చేస్తూ.. తీవ్రంగా మాట్లాడారు. చెన్నేకొత్తపల్లిలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top