పేదల చేతుల్లోనే బాబుకు శాశ్వతంగా రాజకీయ సమాధి: మంత్రి నాగార్జున

Merugu Nagarjuna Slams Chandrababu Manifesto Mahanadu - Sakshi

సాక్షి, అమరావతి: 2014 ఎన్నికల మేనిఫెస్టో హామీలన్నీ బాబు గాలికొదిలేశాడని మేరుగు నాగార్జున విమర్శించారు. 650కిపైగా హామీల్లో 10శాతం కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు.చంద్రబాబు రాజమండ్రిలో ఆదివారం కొత్త పలుకులు, వాగ్దానాలతో ఊదరగొట్టాడని, ఆయన వాగ్దానాలపై జనం నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. అమ‌రావ‌తి స‌చివాల‌యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున సోమవారం మీడియాతో మాట్లాడారు. పేదవాళ్లు అంటూ ఇప్పుడు కొత్తగా వారిపట్ల ప్రేమ కురిపిస్తున్న ఈ బాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడనేది ప్రజలందరికీ తెలుసని అన్నారు.

‘ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవాడ్ని ఆయన కోటీశ్వరుడ్ని చేసిన దాఖలాలు లేదు. తల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న సామెత చందంగా అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్లకు మంచి చేయనోడు.. రేపు అధికారం ఇస్తేనే మంచి చేస్తానని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. పేదవారి గురించి, వారి భవిష్యత్తు గురించి  చంద్రబాబు కొత్తగా పలుకుతుంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారు. 

చెప్పుకోదగ్గ పథకం లేదని బాబు సిగ్గుపడాలి
చంద్రబాబు హయాంలో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన, ఆయన గొప్పగా చెప్పుకోదగ్గ ఒక్క ప్రభుత్వ పథకమైనా ఉందా..? ఈ ప్రశ్నకు సమాధానమివ్వలేని చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి.  చంద్రబాబు హయాంలో ఆయన ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఏమైనా ఉన్నాయంటే, అది బాబు దోపిడీముఠాలకు దోచిపెట్టే పథకాల్ని మాత్రమే పెట్టాడు. జన్మభూమి కమిటీల పేరుతో ఇష్టానుసారంగా పేదల్ని దోచుకునేందుకు గేట్లు తెరిచి చంద్రబాబు, ఆయన తాబేదార్లు కోటాను కోట్లు గడించి బాగుపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు అనేకమంది ప్రభుత్వం తరఫున పేదలు లబ్ధిపొందాలంటే జన్మభూమి కమిటీల గ్రీన్‌సిగ్నల్‌ కోసం లంచాలు సమర్పించుకోవాల్సిరావడంతో తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్ని చూశారు. 

బాబు దృష్టిలో మేనిఫెస్టో అనేది చెత్తబుట్ట
చంద్రబాబు వాగ్దానాలు, అమలుతీరును పరిశీలిస్తే.. ఆయన రాజకీయాల్లో మాట్లాడిన ఏ ఒక్కమాటను నిలబెట్టుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదవాళ్లు ఇప్పుడు అధికారంలో లేనప్పుడు గుర్తుకు వస్తారా..? 2014లో ఎన్నికలప్పుడు 650కి పైగా వాగ్దానాలతో టీడీపీ మ్యానిఫెస్టో ప్రకటిస్తే.. వాటిలో కనీసం 10 శాతం కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదనేది జగమెరిగిన సత్యం. పైగా, తనను జనం నిలదీస్తారనే భయంతో తమ పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోను తొలగించుకున్న నీచమైన చరిత్ర చంద్రబాబుది. అంటే, ఎన్నికల మ్యానిఫెస్టో అనేది చంద్రబాబు దృష్టిలో చెత్తబుట్టతో సమానంగా చూస్తాడని అర్థమౌతుంది. ఈ రోజు కొత్తగా పేదవాళ్ల భవిష్యత్తు అంటూ బాబు చెప్పే వాగ్దానాల్ని నమ్మేందుకు ప్రజలు కళ్లులేని కబోధులు కాదు. 
చదవండి: చంద్రబాబు చెప్పేవన్నీ నంగనాచి కబుర్లే: కురసాల కన్నబాబు

అందలం ఎక్కించిన వారినే తన్నడం బాబు నైజం
చంద్రబాబుకు అబద్ధాలాడటం వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకోవచ్చు. అబద్ధాలను నిజాలుగా నమ్మించాలనే బాబు ఆతృత ఆయన కుసంస్కారానికి నిదర్శనం. అందలం ఎక్కడం.. అధికారంలోకి రాగానే అందలం ఎక్కించిన వారిని ఎగిరెగిరి తన్నడం చంద్రబాబుకు బాగా అలవాటు. 2014లో సాయపడి అధికార కుర్చీలో కూర్చొబెట్టిన దత్తపుత్రుడ్ని కూడా చంద్రబాబు తన్నాడు కదా..? దాన్ని ఎవరూ మరిచిపోలేరు. అప్పట్లో ఆ దత్తపుత్రుడికి కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా వాడుకుని నీచంగా ప్రవర్తించిన పరిస్థితిని అందరూ చూశారు.

మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా నమ్మిన జగన్‌
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో చంద్రబాబుకు, సీఎం జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్నికలు, మ్యానిఫెస్టో హామీలు, ప్రజల సంక్షేమంలో చంద్రబాబు పాలనని, జగన్‌ పాలనతో పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల మేనిఫెస్టో అనేది అన్ని వర్గాల ఆరాధ్యదైవమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా మనం నమ్మాలని.. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మేరకు అందులోని 98.5 శాతం హామీల్నీ నిలబెట్టుకున్న దమ్మున్న నాయకుడు మా జగన్‌ అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎన్నికల మేనిఫెస్టో హామీల్ని నిలబెట్టుకోవడంలో జగన్‌ ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారో.. అదే మాకు, మాపార్టీకి బలమని మేం దమ్ముగా చెప్పుకుంటున్నాం. 

పేదల వ్యతిరేక మనస్తత్వంతో బాబు
చంద్రబాబు రాజకీయం, ఆయన మనస్తత్వం అడుగడుగునా పేదల వ్యతిరేక భావనతోనే నడిచింది. బాబు చెప్పే వాగ్దానాలు నాలుగు రోజుల తర్వాత ఎక్కడుంటాయో కూడా చెప్పలేం. కులాల్ని రెచ్చగొట్టి.. పేదలపై ఉసిగొలిపి.. వారికి సరైన విద్య అందకుండా, ఇళ్లస్థలాలు దక్కకుండా కోర్టులకెళ్లే నీచ, నయవంచన స్వభావి చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. నాడు నేడు పేరుతో మేం ప్రభుత్వ బడుల్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడ్డాడు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తామంటే కోర్టులకెళ్లి కాదన్నాడు. నిన్న అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఇస్తుంటే డెమోగ్రఫికల్‌ ఇన్‌బ్యాలెన్స్‌ వస్తుందంటూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు. చంద్రబాబుకు పేదల పట్ల ఇంత అహంకారం ఏమిటి..?

దమ్ముంటే చర్చకు వస్తావా .?
మోసం చేసిన ఏ ఒక్క నాయకుడ్ని కూడా ప్రజలు అంతుచూసేదాకా వదిలిపెట్టరు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్‌ నాలుగేళ్ల పాలనలో ఇప్పటికే రాష్ట్రంలో రూ.2.11 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిని నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశాం కనుక.. ఎక్కడా ఒక్క పైసా అవినీతికి తావులేకుండా సంక్షేమ వ్యవస్థ నడుస్తున్నందున మేం ఇంత ధీమాగా ఉన్నాం. ప్రజలంతా ఈరోజు సంతోషంగా ఉండటమే మాకు శ్రీరామరక్ష. ఇలాంటి సంక్షేమ వాతావరణం చంద్రబాబు హయాంలో ఏనాడైనా చూశారా..? ఉంటే, చర్చిద్దాం వస్తారా..? అంటూ సవాల్‌ విసురుతున్నాను. 

బాబు ఊసరవెల్లి కబుర్లు జనం నమ్మరు
ఎన్నికల వాతావరణం వచ్చేసరికి తాను ఏ రకమైన చిలుక జోస్యం చెప్పినా.. జనం తన మాటల మాయలో పడతారనుకోవడం చంద్రబాబు భ్రమ మాత్రమే. గతంలో మాదిరిగా ఆయన మాటల మాయాజాలంలో పడి చంద్రబాబును ఎత్తుకునేందుకు జనం కళ్లులేని కబోధులేమీ కాదని.. ఆయన ఊసరవెల్లి కబుర్లును జనం నమ్మరుగాక నమ్మరు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల పట్ల హీనంగా, నీచంగా ప్రవర్తించినందునే 2019లో బాబును ఓడించారు.. రేపు 2024లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. పేదల ఇళ్లను సమాధులతో పోల్చినప్పుడే బాబుకు శాశ్వత రాజకీయ సమాధి కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బాబుకు భవిష్యత్తు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు’ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top