అఘాడీ కూటమితోనే శివసేన.. ఆ అడ్డంకిని అధిగమిస్తాం: ఉద్ధవ్‌ థాక్రే

Maha Vikas Aghadi MVA Allies Met After Fall Of Its Government - Sakshi

ముంబై: మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి ‘మహా వికాస్‌ అఘాడీ’(ఎంవీఏ) కూటమి భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లు సమావేశమయ్యాయి. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాంతాలను బట్టి ఉమ్మడిగానా లేదా స్వతంత్రంగానా? అనేది నిర్ణయం తీసుకోనున్నారని ఆయా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ..‘మూడు పార్టీలు కలిసికట్టుగా కోవిడ్‌-19 మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. దాంతో పోలిస్తే ఈ ‍ఆటంకం(షిండే-ఫడ్నవీస్‌ ప్రభుత్వం) చాలా చిన్నది. దానిని మేము అధిగమించి కలిసే ఉన్నామని దేశానికి సందేశం ఇస్తాం. గతంలో కంటే ఇప్పుడే ఎంవీఏ బలంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము కలిశాం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనివ్వండి.’ అని పేర్కొన్నారు ఉద్ధవ్‌ థాక్రే.

అందుకే అక్కడ భేటీ.. 
ఎంవీఏ భాగస్వామ్య పక్షాలు కలిసే ఉన్నాయని, ఈ సమావేశం ద్వారా ఆ సందేశాన్ని అందిస్తున్నామని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు.  ఈ సమావేశం రాష్ట్ర శాసనసభలోని శివసేన శాసనసభాపాక్ష పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మహా వికాస్‌ అఘాడీతోనే శివసేన ఉందనటమే కాదు.. థాక్రే వర్గమే అధికారిక శివసేన అనే సందేశాన్ని షిండే ప్రభుత్వానికి పంపించేందుకు ఇక్కడ భేటీ అయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. థాక్రేతో పాటు ఎన్‌సీపీ నుంచి అజిత్‌ పవార్‌, జయంత్‌ పాటిల్‌, దిలిప్‌ వాల్సే పాటిల్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహేబ్‌ థోరట్‌, పృథ్విరాజ్‌ చావన్‌, అశోక్‌ చావన్‌, సమాజ్‌ వాదీ పార్టీ నుంచి రైస్‌ షేక్‌ వంటి సీనియర్‌ నేతలు హాజరయ్యారు.

ఇదీ చదవండి: శివసేన గుర్తు ఎవరికి? 8 ప్రశ్నలు రూపొందించిన సుప్రీంకోర్టు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top