సీఎండీఆర్‌ఎఫ్ కేసు: పినరయి విజయన్‌కు లోకాయక్త క్లీన్‌ చిట్‌

Lok Ayukta gives clean chit to CM Pinarayi Vijayan in CMDRF case - Sakshi

CMDRF Scam Pinarayi Vijayan: ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సీఎండీఆర్‌ఎఫ్) దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కేసులో కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రభుత్వానికి ఊరట లభించింది.  గతంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ లోకాయుక్త సోమవారం తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా  పినరయి విజయన్‌తో పాటు 18 మంది మాజీ కేబినెట్ మంత్రులపై వేసిన పిటిషన్‌ను లోకాయుక్త  తిరస్కరించింది. బంధుప్రీతి లేదా అవినీతి జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని లోకాయుక్త జస్టిస్ సిరియాక్ జోసెఫ్, అప్ లోకాయుక్తలు జస్టిస్ హరూన్ అల్ రషీద్, జస్టిస్ బాబు మాథ్యూ పి జోసెఫ్‌లతో కూడిన లోకాయుక్త బెంచ్ పేర్కొంది. 

సీఎండీఆర్‌ఎఫ్‌లోని నిధులను దుర్వినియోగం చేశారంటూ 2018లో  సీఎంతో పాలు పలువురు మంత్రులపై కేసు నమోదైంది.  నిబంధనలకు విరుద్ధంగా  ఎన్సీపీ మాజీ చీఫ్ ఉజ్వూర్ విజయన్ కుటుంబానికి రూ.25 లక్షలు, దివంగత ఎమ్మెల్యే రామచంద్రన్ నాయర్ కుటుంబానికి రూ.9 లక్షలు, ప్రమాదంలో మరణించిన పోలీసు అధికారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారని ఆరోపిస్తూ  అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు ఆర్ఎస్ శశికుమార్  పిటిషన్‌ దాఖలు  చేశారు.  జస్టిస్ సిరియాక్ జోసెఫ్, జస్టిస్ హరున్ ఉల్ రషీద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాజ్యాన్ని విచారించింది. అయితే సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో మార్చి 2023లో, ఈ కేసును పెద్ద బెంచ్‌కు రిఫర్ చేసింది.

ఇది ఊహించిందే, హైకోర్టుకెళతా
ఇది ఇలా ఉంటే తాజా నిర్ణయాన్ని కేరళ హైకోర్టులో సవాల్‌ చేస్తానని పిటిషన్‌ ఆర్‌ఎస్‌ శశికుమార్‌ తెలిపారు. తీర్పు ఊహించినదేనని, దీనికి వ్యతిరేకంగా అప్పీల్ చేస్తానని చెప్పారు. లోకాయుక్తలో గతంలో రెండు వేలుండే కేసులు ఇపుడు 200కి తగ్గాయని పేర్కొ‍న్నారు. ఈ సంస్థపై ప్రజలకు నమ్మకం పోయిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన ఆరోపించారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top