రైతు సంక్షేమానికే మా తొలి ప్రాధాన్యత

అన్నదాతల కోసం ఇప్పటివరకు రూ.10,200 కోట్లు ఖర్చు చేశాం
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
సాక్షి, అమరావతి: దేశంలో ఎవరూ చేయని విధంగా ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఒక్క మంచి ముక్క రాయడానికి మనసొప్పని ఈనాడు, తదితర మీడియా సంస్థలు పనిగట్టుకుని.. మైక్రోస్కోపులు పెట్టి మరీ లోపాలను వెతికే పనిలో పడ్డాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. రైతు సంక్షేమానికే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. కోవిడ్–19 వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నిధులకు వెరవకుండా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో వివరించారు. 16 నెలల్లోనే రూ.10,200 కోట్లు రైతులకు ఇచ్చిన ప్రభుత్వం తమదన్నారు. తాజాగా రూ.4 వేల కోట్లతో జలకళ పథకాన్ని చేపట్టామని తెలిపారు. ప్రకటనలోని ముఖ్యాంశాలు..
► ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ప్రతి అన్నదాతకూ తెలుసు. సూక్ష్మసేద్యం పథకమూ మా ప్రాధాన్యతలో ఉంది. ఈ విషయం తెలియని ఈనాడు, తదితర మీడియా సంస్థలు ఏవేవో రాతలు రాస్తున్నాయి. రైతులంతా సంతోషంగా ఉంటే ఓర్వలేక బురద జల్లుతున్నాయి.
► చంద్రబాబు పాలనలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు, కరువును జయించామని పిట్టలదొర కథలు చెప్పినప్పుడు, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఏనాడూ పట్టించుకోని ఈనాడు పత్రిక ఇప్పుడు అసత్యాలను, అర్ధ సత్యాలను ప్రచారం చేస్తోంది.
► సీఎం వైఎస్ జగన్ హయాంలో రైతు భరోసా, ప్రతి పంటకు గిట్టుబాటు ధర, గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం.
► రైతుల కోసం ఇంత మేలు చేసే ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందేమో చూపించాలి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి