కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు! | Kuppam TDP BC Leaders Fires On Chandrababu Special Story In Telugu, Details Inside - Sakshi
Sakshi News home page

కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు!

Published Sun, Mar 3 2024 11:46 AM

Kuppam TDP BC Leaders Fires On Chandrababu Special Story - Sakshi

టీడీపీ అధినేత చంద్రబాబుకు తనసామాజికవర్గ నేతలు ఉంటే.. ఇంక ఎవరితోనూ పని ఉండదు. బీసీలను అసలు పట్టించుకోరు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుతో మండిపడుతున్నారు. ఇంతకాలం తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారిని పక్కన పెట్టి ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్‌ చేస్తే సహించేది లేదంటున్నారు. అసలు కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? 

తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన కుర్చీ కదిలిపోతోంది. ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా కూడా సొంత నియోజకవర్గానికి కనీసం తాగు, సాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కుప్పం దశ తిరిగింది. అన్నివిధాలుగానూ కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నది నీటిని కుప్పంకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు. పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నారు. 

నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించారు. గండం నుంచి గట్టెక్కడానికి కుప్పం పార్టీని తన సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా నేత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసిన తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు..కుప్పంలో ఆయనకు పీఏలుగా పనిచేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసేశారు. దీంతో వారు లోపల ఉండలేక..బయటకు పోలేక అల్లాడిపోతున్నారు. 

ఇన్నేళ్ళుగా తమను వాడుకుని..ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో  చూపిస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజికవర్గ నేతలు. తమను నమ్మకుండా బాధ్యతలు లేకుండా చేసినపుడు ఇంకా తాము టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు సేవ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం భారీ మెజారిటీ రావడానికి, అసలు ఆయన విజయం సాధించడానికి అక్కడ చేర్పించిన దొంగ ఓట్లే కారణం. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కుప్పంలో చంద్రబాబు చేర్పించుకున్న దొంగ ఓట్లలో 33 వేలకు పైగా తొలగించారు. అందుకే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటున్నారు అక్కడి బీసీ నేతలు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కుప్పంలో అధికార పార్టీ బాగా బలం పుంజుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో నిరాశా  నిస్పృహలు ఆవరించాయి. ఒకవైపు కేడర్‌లో నైరాశ్యం..బీసీ నేతల్లో పార్టీ అధినేత పట్ల ఆగ్రహం..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత...మొత్తం కలిపి కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమనే టాక్ నడుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement